అన్ని సినిమాల్లోనూ హీరో, హీరోయిన్ల పాత్రలు మాత్రమే కాదు.. సపోర్టింగ్ రోల్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. చెప్పాలంటే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటాయనే చెప్పాలి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే.. ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో రావు రమేష్, ‘మగథీర’ సినిమాలో శ్రీహరి, ‘బాహుబలి’ లో సత్య రాజ్.. వంటి నటులు పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈ కోవలోకే వస్తుంది ‘టెంపర్’ సినిమాలో మూర్తి పాత్ర. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. దయ పాత్ర ఎంతమందికి గుర్తుంటుందో.. వాళ్ళందరికీ మూర్తి పాత్ర కూడా గుర్తుంటుంది అనడంలో సందేహం లేదు.
కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పోసాని కృష్ణమురళితో ఈ సీరియస్ రోల్ ను చేయించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అయితే ఈ పాత్రకు దర్శకుడు పూరి మొదటి ఛాయిస్.. పోసాని కాదట.! ‘పీపుల్స్ స్టార్’ ఆర్.నారాయణ మూర్తితో ఈ పాత్రను చేయించాలి అని పూరి అనుకున్నాడట.ఆ విషయమై పూరి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఆర్.నారాయణ మూర్తి కూడా ఈ విషయం పై స్పందించారు.
‘నేను సమాజంలో చూసే కొన్ని లోటు పాట్లను సినిమాల ద్వారా ప్రజలకు తెలియజెయ్యాలని నేను ఇప్పటి వరకూ నటిస్తూ వచ్చాను. అంతేకాని డబ్బులు కోసం ఎప్పుడూ సినిమాలు చెయ్యలేదు. ‘టెంపర్’ సినిమాలో మూర్తి పాత్ర నాకు బాగా నచ్చింది. కానీ అలాంటి కమర్షియల్ సినిమాలో నటించే ఉద్దేశం లేదు. అందుకే ఆ పాత్రను రిజెక్ట్ చేశాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.