సాధారణంగా సెలబ్రిటీలు తమ సంపాదనను పేదల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయితే రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మాత్రం తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. నటుడిగానే కాక ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా లారెన్స్ తనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. స్వయంకృషితో ఎదిగిన లారెన్స్ నిన్న కార్మికుల దినోత్సవం సందర్భంగా పది ట్రాక్టర్లను రైతులకు అందజేసి వార్తల్లో నిలిచారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ వీడియో వైరల్ అవుతోంది. గతంలో పేద రైతులకు ట్రాక్టర్లను ఉచితంగా అందిస్తానని మాట ఇచ్చిన రాఘవ లారెన్స్ ఆ హామీని ఎట్టకేలకు నిలబెట్టుకున్నారు. దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసిన లారెన్స్ కొన్నిరోజుల గ్యాప్ లోనే ఉచితంగా ట్రాక్టర్లను పంచారు. ఈ సేవా కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా లారెన్స్ మాత్రం డబ్బు కంటే పేద ప్రజలకు, వికలాంగులకు, అనాథలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే ముఖ్యమని భావిస్తున్నారు.
కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దామని లారెన్స్ చెబుతున్నారు. విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ ఫ్యామిలీకి లారెన్స్ తొలి ట్రాక్టర్ ను అందించారు. భర్త చనిపోయిన సోదరి కుటుంబాన్ని రాజకన్నన్ పోషిస్తున్న నేపథ్యంలో అతని ఫ్యామిలీకి లారెన్స్ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతోంది.
లారెన్స్ ట్రాక్టర్ ను బహుమతిగా ఇవ్వడంతో రాజకన్నన్ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. లారెన్స్ కాళ్లపై పడి రాజకన్నన్ కుటుంబ సభ్యులు సంతోషాన్ని పంచుకున్నారు. లారెన్స్ మనిషి రూపంలో ఉన్న దేవుడని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా లారెన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.