Raghavendra Rao: రీమేక్‌ అంటూ ఇన్నాళ్లూ ఊరించారు… ఇప్పుడు నో చెప్పి ఉసూరుమనిపించారుగా

  • January 2, 2024 / 01:12 PM IST

చిరంజీవి సినిమాల్లో వేటిని రామ్‌చరణ్‌ రీమేక్‌ చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అభిమానిని అడిగితే చెప్పే లిస్ట్‌లో కచ్చితంగా ఉండే రెండు సినిమాలు ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా పేర్లు లేకుండా చరణ్‌ రీమేక్స్‌ బకెట్‌ లిస్ట్‌ ఉండదు అనే చెప్పాలి. అందులో ఓ సినిమా గురించి ఎన్నో ఏళ్లుగా వింటూనే ఉన్నాం. అదే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. దీనికి రీమేక్‌ అయినా ఉంటుంది, లేదంటే సీక్వెల్‌ అయినా ఉంటుంది అని ఇన్నాళ్లూ ఊరించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఉసూరుమనిపించారు.

అవును, మీరు చదివింది కరెక్టే. చిరంజీవి కెరీరలో స్పెషల్‌ మూవీ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో చరణ్‌ను చూసే పరిస్థితి ఇకలేదు. ఎందుకంటే ఆ పని చేస్తానని ఎన్నో ఏళ్లుగా చెబుతున్న ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు ‘చేయను’ అంటూ డీల్‌ క్లోజ్‌ చేసేశారు. గతంలో ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు రాఘవేంద్రరావు మాటలు వింటుంటే మరి లేనట్లే అనిపిస్తోంది.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా టైమ్‌కి దక్షిణాదిలో చిరంజీవి కింగ్, నార్త్ ఇండస్ట్రీలో శ్రీదేవి టాప్. అలాంటి ఇద్దరూ కలసి ఆ సినిమా చేశారు. ఆ సినిమాను రీమేక్ చేయమని చాలామంది అడిగారు. చరణ్‌తో ఆ సినిమా రీమేక్ చేయాలనేది అశ్వనీదత్ కు కోరిక. నన్ను చాలాసార్లు అడిగారు కూడా. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆ సినిమాను రీమేక్‌ చేసినప్పుడు ఎంత అద్భుతంగా చేసినా చిరంజీవి – శ్రీదేవే గుర్తొస్తారు. చరణ్ గుర్తుకురాడు.

పైగా చరణ్‌ను, చిరంజీవిని కంపేర్‌ చేస్తారు. అందుకే ఆ ఆలోచన విరమించుకున్నాను అని (Raghavendra Rao) రాఘవేంద్రరావు చెప్పారు. అయితే, రాఘవేంద్రరావు చేయను అన్నారు కానీ… ఆ సినిమా ఆలోచనే ఆగిపోయింది అనలేదు. ఆయన తప్పుకున్న నేపథ్యంలో వేరే దర్శకుడు ఎవరైనా ఆ కథను భుజానికెత్తుకుంటారేమో చూడాలి. ఆ మధ్య ఎప్పుడో నాగ్‌ అశ్విన్‌ ఆ కథ చేస్తారేమో అనే టాక్‌ కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఏమన్నా ఆసక్తి చూపిస్తారా?

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus