ఒకప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ రూ.50 కోట్లకు మించేది. ఎందుకంటే మన సినిమాకి అంతకు మించి మార్కెట్ లేదు అని హద్దులు పెట్టేసుకున్నారు తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు. కానీ రాజమౌళి ‘మగధీర’ తో ఆ హద్దులను చెరిపేశాడు. ఆ సినిమా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి.. బాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సినిమాకి పెట్టింది రూ.42 కోట్ల బడ్జెట్ మాత్రమే..! అయితే అటు తర్వాత ‘బాహుబలి'(సిరీస్) చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ప్లాన్ చేస్తే..
నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు.’రాజమౌళికి పిచ్చా.. తేడా వస్తే నిర్మాత బలి’ అని కామెంట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా వాటిని రాజమౌళి పట్టించుకోకుండా ముందుకు సాగాడు. తన పనినే నమ్ముకున్నాడు కానీ ఆ విమర్శలకు లోనయ్యి టెన్షన్ పడలేదు. అందుకే ‘బాహుబలి'(సిరీస్) పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇంతకు మించి సాధించేది ఏముంటుంది అని రాజమౌళి తన సక్సెస్ కు ఫుల్ స్టాప్ పెట్టుకోలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాడు.
ఈ సినిమాతో చాలా అద్భుతాలు జరిగాయి. టాలీవుడ్లో ఒకే జనరేషన్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయడం.. ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో సక్సెస్ అందుకోవడం అనేది కేవలం రాజమౌళికి మాత్రమే దక్కాల్సిన క్రెడిట్. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే అది రాజమౌళి వల్లే అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇండియాలో భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు అంటే అది రాజమౌళి చేసిన అద్భుతమే.
పాన్ ఇండియా సినిమాకి ఎలా అయితే మార్గం చూపించాడో ‘ఆస్కార్’ కు కూడా అదే విధంగా మార్గం చూపించాడు రాజమౌళి. ‘ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ రావడం అనేది అసాధ్యం’ వంటి మాటలను తిప్పికొట్టింది రాజమౌళి. తాను తెలివైన వాడు కాదా… ఆ మాట నిజమే అనుకుని అక్కడే ఆగిపోవడానికి..! రాజమౌళి.. దేనికి హద్దులు పెట్టుకోలేదు అని ఈ విషయంతో అయినా అర్థం చేసుకోవాలి. మన సినిమాని ఇంటర్నేషనల్ వైడ్ ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు.. విదేశీయులకు మన సినిమా కంటెంట్ ను అర్ధమయ్యేలా చూపించి ఎలా ఆస్కార్ కొట్టొచ్చు..
దానికి ఎంత డబ్బు ఖర్చవుతుంది అనేది ‘ఆర్.ఆర్.ఆర్’ తో అందరికీ తెలిసేలా చేశాడు రాజమౌళి. డబ్బు పెట్టి రాజమౌళి ఆస్కార్ ను కొనుక్కోలేదు. అది ఓ తెలుగు సినిమాకి రావడానికి తన టీంతో విదేశాల్లో ప్రచారం చేయించుకున్నాడు. అది వాస్తవమే. అది ఏమాత్రం తప్పుకాదు. మన దగ్గర మంచి కంటెంట్ ఉన్నప్పుడు.. దాని పై మనకు కొండంత నమ్మకం ఉన్నప్పుడు మార్కెటింగ్ చేసుకోవడంలో తప్పేమి లేదు. నిజానికి ఆర్.ఆర్.ఆర్..
ఇండియన్ సినిమా తరఫున అఫీషియల్ గా ఆస్కార్ రేసులో ఎంటర్ అవ్వలేదు. ఆ టైంలో అందరూ ఎంతలా టెన్షన్ పడ్డారో తెలిసిన సంగతే. అయితేనేం కామన్ ఎంట్రీలోనే ఆస్కార్ బరిలో నిలిచింది ఆర్.ఆర్.ఆర్. భవిష్యత్తులో పెద్ద సినిమాలు నిర్మించే ఫిలిం మేకర్స్.. తమ సినిమాలో కంటెంట్ పై నమ్మకం ఉంటే ‘ఆస్కార్’ కోసం కూడా కొంత బడ్జెట్ కేటాయించుకోవడం మంచిదే అని ఆస్కార్ తో రాజమౌళి చాటిచెప్పాడు.