స్టార్ డైరెక్టర్ రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించి చెప్పిన సమయానికే సినిమా రిలీజయ్యేలా షూటింగ్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగని పక్షంలో ఆర్ఆర్ఆర్ ఆ తేదీకే రిలీజవుతుంది. చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయడనే అపవాదును రాజమౌళి చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మిగతా డైరెక్టర్లు మాత్రం ఏ తేదీకి తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారో చెప్పలేకపోతున్నారు.
మొదట జులై 30వ తేదీన రాధేశ్యామ్ ను రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ దర్శకనిర్మాతలు ప్రకటించగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఆ తేదీకి సినిమా రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అఖండ సినిమా వినాయకచవితికి రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
కొరటాల శివ డైరెక్షన్ లో చిరు, చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో సరైన రిలీజ్ డేట్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా తేలాల్సి ఉంది. దసరాకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండటంతో డిసెంబర్ లేదా జనవరిలో అఖండ మినహా మిగిలిన సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ విషయంలో మిగతా డైరెక్టర్ల కంటే జక్కన్నే గ్రేట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.