సినిమా ఇండస్ట్రీ అందరికీ… విస్తరాకులో షడ్రుచుల భోజనం లాంటిది కాదు. ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్నా… ఒకానొక సమయంలో సగటు మనిషే అనే విషయం గుర్తుంచుకోవాలి. అలా అలాంటి సగటు మనిషి రోజుల్ని ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి గుర్తు చేసుకున్నారు. మద్రాసులో తన కుటుంబం ఉన్నప్పుడు పడ్డ కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడారు. దీంతో రాజమౌళి గతం ఇంత కష్టంగా సాగిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాలన్నీ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో చెప్పుకొచ్చారు.
తన చిన్నతనం గురించి ఆయన ఏం చెప్పారంటే…రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రచయిత అనే విషయం తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించిన ఆయన ‘అర్ధాంగి’ (1996) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఆ తర్వాత ఆయన రచయితగా కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దర్శకుడు అయిపోయారు కదా… రచయితగా పిలిస్తే రాస్తారా అనే అనుమానం అప్పటి సినిమా వాళ్లలో ఉండేదట.
ఈ క్రమంలో ఇంట్లో గడవడానికి కూడా కష్టమయ్యేదట. మరోవైపు ఇంట్లో అవసరాల కోసం పక్కనే ఉన్న కూరగాయలు, కిరాణా షాపుల్లో ఖాతా పెట్టేవారట. ఓసారి రాజమౌళి (చిన్నప్పుడు) కూరగాయల షాప్‌కి వెళ్లి షాపు వాడిని పిలిచారట. ఒకసారికి షాపువాడు పలకలేదట. దీంతో నాలుగైదే సార్లు పిలిచారట. ఆఖరికి ఇంకా పలకడం లేదని గట్టిగా అరిచారట. దాంతో ఆ షాపాయన కోపంతో రాజమౌళిని తిట్టాడట. కాస్త కటువుగా మాట్లాడాడట. దీంతో రాజమౌళికి చాలా కోపం వచ్చేసిందట.
‘నా తప్పు లేకుండా.. నేను కేవలం పిలిస్తే తిట్టడమేంటి’ అనుకున్నారట. ఈ విషయం ఇంట్లో చెప్పారట. అయితే ఇంట్లో వాళ్లు సర్దిచెప్పారు. కానీ రాజమౌళి మనసులో కోపం మాత్రం అలానే ఉండిపోయిందట. పెద్దయ్యాక వాణ్ని పట్టుకుని తన్నాలి అని అనేంత కోపం వచ్చిందట. కానీ పెద్ద దర్శకుడు అయ్యాక రాజమౌళి ఓసారి మద్రాసు వెళ్లినప్పుడు ఆ షాపు దగ్గరకు వెళ్లారట. ఆ సమయంలో షాపు వ్యక్తి వచ్చి… ‘ఎలా ఉన్నావ్. బాగున్నావా?’ అంటూ ఆప్యాయంగా పలకరించాడట. దీంతో అప్పటి కోపం తగ్గిపోయింది అని చెప్పారు రాజమౌళి.