‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి రామ్ చరణ్ పాత్రకి సంబంధించిన టీజర్ విడుదలైన తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో టీజర్ వస్తుందని ఆశగా ఎదురుచూశారు. మొత్తానికి వారి కోరిక మేరకు కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేశాడు జక్కన్న. అయితే రామ్ చరణ్ టీజర్ తో పోలిస్తే.. భీమ్ టీజర్ అంత ఎగ్జైటింగ్ గా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు కొమరం భీమ్ టీజర్ లో చూపించిన విజువల్స్ వివాదాస్పదంగా మారాయి. టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే అందులో కొన్ని షాట్లు ఎక్కడ నుండి కాపీ చేశారనే విషయాన్ని కనిపెట్టేశారు నెటిజన్లు.
కొమరం భీమ్ గిరిజన తెగకు చెందిన వ్యక్తి. ఆయన జీవితంలో ఎక్కువ భాగం అటవీ నేపథ్యంలోనే సాగింది. అందుకే టీజర్ లో అడవులకు సంబంధించిన విజువల్స్ ని చూపించారు. ఈ సన్నివేశాలను ఓ డాక్యుమెంటరీ నుండి కాపీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. వర్షంలో నీటి బిందువుల షాట్, అడవి మధ్యలో సూర్య బింబం, అలానే అగ్నిపర్వతం విజువల్స్ అన్నీ కూడా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ కి చెందిన ఓ డాక్యుమెంటరీలో నుండి తీసుకున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్రపంచం అరచేతిలోకి వచ్చిన తరువాత నెటిజన్లకు ఇలాంటివి కనిపెట్టడం చాలా సులువుగా మారింది.
ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా పోస్టర్ల విషయంలో కూడా మేకర్లు ఇలాంటి కాపీ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా కారణంగా రాజమౌళికి విజువల్స్ తీసే సమయం లేక ఇలా ఒకట్రెండు షాట్లను తీసుకొని ఉంటారు. కానీ ఇంటర్నెట్ కారణంగా దొరికిపోయారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలకు సంబంధించి ఇలాంటి కామెంట్స్ వినిపించాయి.