సినిమా పరిశ్రమలో లెజెండ్స్‌ని అలా కదిపితే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయ. కొన్ని సరదాగా ఉంటే, కొన్ని షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని నిజమా ఇలా చేశారా అని కూడా అనిపిస్తాయి. అలాంటివి ఎన్నో విషయాలు మనం గతంలో చూశాం, విన్నాం కూడా. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్ని ప్రముఖ హీరో రజనీకాంత్ చెప్పారు. ఆయన చెప్పింది కూడా ఎవరో సాధారణమైన వ్యక్తి గురించి కాదు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి. ఆయన మందు కొట్టి చేసిన విన్యాసాల గురించే తలైవా చెప్పుకొచ్చారు.
ఇళయరాజా 50 ఏళ్ల సినీ వేడుకలో ఇటీవల చెన్నైలో జరిగింది. దానికి రజనీకాంత్ ఓ అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో తాను, ఇళయరాజా, దర్శకుడు మహేంద్రన్ కలసి ఒక సందర్భంలో మందు పార్టీలో కూర్చున్న విషయం గురించి చెప్పుకొచ్చారు. మహేంద్రన్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘జానీ’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో రజనీ, మహేంద్రన్, ఇళయరాజా మందు తాగారట. అయితే ఇళయరాజా అర బీరు మాత్రమే తాగారట. ఆ మాత్రం తాగి ఆయన ఆడిన ఆట అలాంటిలాంటిది కాదని రజనీ వివరించారు.
మందు తాగడం ప్రారంభించాక ఊర్లో ఉన్న అన్ని గాసిప్పుల గురించి ఇళయరాజా అడిగారని, హీరోయిన్ల గురించి కూడా మాట్లాడారని రజనీ చెప్పారు. అంతేకాదు వాటి నుంచే ఆయన పాటలలు వచ్చాయని రజనీ నవ్వేశారు. రజనీ మాట్లాడుతున్నంతసేపు పక్కనే ఉన్న ఇళయరాజా అదంతా అబద్ధం అన్నట్లుగా చేతులు ఊపడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని ఇళయరాజా ముందే చెప్పారు. రజనీ కంటే ముందే మాట్లాడుతూ ఈ వేడుకలో నా గురించి జనాలకు తెలియని విషయాలు చెబుతానని రజనీ మొన్నీమధ్య మేం మాట్లాడుకుంటుండగా చెప్పారు. అందులో తాను మందు కొట్టిన విషయం కూడా ఉంటుందని హెచ్చరించాడు అని ఇళయరాజా చెప్పారు.
రజనీ, ఇళయరాజా మధ్య అనుబంధం ఉందని తెలిసినా.. ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని, ఇలా చేస్తారని, ఇలా మట్లాడుకుంటారని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ వేడుక వల్ల అందరికీ తెలిసింది అని చెప్పొచ్చు.