డీ ఏజినింగ్ టెక్నాలజీ… గత కొన్ని రోజులుగా ఇండియన్ సినిమాలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో వినిపిస్తున్న మాట ఇది. అంటే వయసు తగ్గించే పాత్రను తెర మీద చూపించే విధానం అన్నమాట. మొన్నామధ్య ఓ తమిళ సినిమాలో హీరోను అలా చూపిస్తారు అని వార్తలొచ్చాయి. అయితే ఎలా, ఏంటి అనే విషయంలో పూర్తి క్లారిటీ రాకపోయినా ఇప్పుడు మరో హీరో కూడా ఇలానే వయసు తగ్గించుకుని కనిపిస్తారు అని ఓ టాక్ నడుస్తోంది.
ప్రముఖ కథానాయకుడు (Rajinikanth) రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. #తలైవర్171 వర్కింగ్ టైటిల్‌తో ఆ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రిప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటికొచ్చింది. అదే ఈ సినిమాలో రజనీ యువకుడిలా కనిపిస్తారట. దీని కోసం డీఏజినింగ్ టెక్నాలజీ వాడుతున్నారట.
యాక్షన్ థ్రిల్లర్‌లో కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తారట. అయితే సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాల కోసమే ఇలా చేస్తారట. రజనీకాంత్ గతంలో ‘కబాలి’, ‘కాలా’, ‘రోబో’ చిత్రాల్లో వయసు తగ్గినట్లుగా కనిపించారు. వాటి కోసం టెక్నాలజీ వాడారు. అయితే ఇప్పుడు లోకేశ్ సినిమాలో ఇంకాస్త పక్కగా యువకుడిలా ఉండేలా చూసుకుంటారట. అందుకే డీఏజినింగ్ వాడతారు అంటున్నారు.
అన్నట్లు ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో మొదలవుతుందని అంటున్నారు. ఈ లోపు కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేస్తారట. ఆ విషయాలను అనౌన్స్ చేస్తారు అంటున్నారు. అయితే ఈ సినిమాలో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలకంగా ఉంటుందట. ఇక ఇప్పటికే విజయ్ – వెంకట్ ప్రభు సినిమాలో కూడా డీఏజినింగ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేశారట. ఒకవేళ ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మన దగ్గర కూడా ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు. త్వరలోనే ఈ విషయాల్లో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.