Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

బాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ సినిమాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani), తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరించడంలో సిద్ధహస్తుడు. ‘మున్నాభాయ్’ ( Munna Bhai), ‘3 ఇడియట్స్’ (3 Idiots), ‘పీకే’ లాంటి చిత్రాలతో ఆయన సాధించిన విజయాలు అందరికీ సుపరిచితమే. ఆయన సినిమాలు మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, కానీ ప్రతి చిత్రం అద్భుతమైన కథతో, ఎమోషనల్ డెప్త్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది. గత చిత్రం ‘డంకీ’ (Dunki) భారీ అంచనాలతో 2023లో విడుదలైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, హిరాణీ రేంజ్ హిట్‌గా నిలవలేకపోయింది.

Rajkumar Hirani

‘డంకీ’ తర్వాత హిరాణీ నుంచి కొత్త సినిమా ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమాచారం బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ మరోసారి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో (Aamir Khan) సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ జోడీ గతంలో ‘3 ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలతో భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం హిరాణీ మూడు కథలపై పనిచేస్తున్నారని, అందులో ఒక కథను అమీర్ ఖాన్ కోసం రూపొందిస్తున్నారని టాక్. ఇప్పటివరకు కథ విషయంలో స్పష్టత లేనప్పటికీ, హిరాణీ, అమీర్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు హిరాణీ స్వయంగా ధ్రువీకరించారు. అమీర్ ఖాన్‌కు హిరాణీపై పూర్తి నమ్మకం ఉందని, ఆయన ఎలాంటి కథ తీసుకొచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా 2026లో షూటింగ్ ప్రారంభమై, 2027లో విడుదల కానుందని అంచనా.

అయితే, హిరాణీ గతంలో తన పాత సినిమాలకు సీక్వెల్స్ తీసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ‘మున్నాభాయ్’ సీరిజ్‌కు మరో సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నానని, కథ మొదటి భాగం సిద్ధమైనప్పటికీ, రెండో భాగం ఇంకా రాయడం పూర్తి కాలేదని చెప్పారు. అమీర్ ఖాన్‌తో కామెడీ ఎంటర్‌టైనర్ అంటే ‘పీకే 2’గా ఉంటుందా అనే చర్చ బాలీవుడ్‌లో సాగుతోంది. గతంలో ‘పీకే’ సినిమా అమీర్ కెరీర్‌లో ఒక ఐకానిక్ చిత్రంగా నిలిచింది, ఇప్పుడు మళ్లీ ఈ జోడీ ఏ మాయ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus