నటుడిగా అనేక విమర్శలను ఎదుర్కున్న రామ్ చరణ్ రంగస్థలం మూవీతో ఆ విమర్శలను తుక్కు తుక్కు చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చరణ్ లోని అన్ని కోణాలను బయటపెడితే.. అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చెర్రీ లేకుండా కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఇందులో చరణ్ పై యాక్షన్ సీన్ పూర్తి చేశారు. తమిళ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్ నేతృత్వంలో ఈ ఫైట్ చిత్రీకరించారు. అలాగే బ్యాంకాక్ షెడ్యూల్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసిన రామ్ చరణ్.. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటపెట్టారు. “నేను ఆస్తికుడిని. దైవాన్ని నమ్ముతాను. అయ్యప్ప భక్తుణ్ణి. గత పదేళ్లుగా అయ్యప్ప దీక్ష పాటిస్తున్నాను. 45 రోజుల పాటు దీక్షలో ఉంటాను. ఈ దీక్షలో ఉండడం నా ఆరోగ్యానికి చాలా మంచిది. హీరోని కాబట్టి శరీరాన్ని అనేక విధాలుగా కష్టపెడుతుంటాము. ఈ దీక్ష డీటాక్స్ గా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను తొలిగించి వేస్తుంది. అంతేకాదు అంతర్గతంగా నాకు మంచి బలాన్ని ఇస్తుంది” అని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ దీక్షని తన తండ్రి చిరంజీవి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నానని స్పష్టం చేశారు. బోయపాటి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు.