సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ అంటుంటారు. మనం పాయింట్ చేసి అడిగితే లేదు, కాదు అని చెబుతారు కానీ.. కచ్చితంగా మనసులో అయితే ఈ సెంటిమెంట్లు బాగానే ఉంటాయి అని చెప్పాలి. ఈ విషయంలో డౌట్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక హీరో ఆ సెంటిమెంట్‌ని గౌరవిస్తూ ఏదో ఒక మార్పు చేస్తుంటారు. ఇప్పుడు రామ్‌చరణ్ కూడా అదే చేశాడు అనిపిస్తోంది. అయితే దీని వెనుక సెంటిమెంట్ ఉందా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది చరణ్ చెబితే కానీ తెలియదు.
రామ్‌చరణ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘పెద్ది’ సినిమా టీమ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సినిమాలో చరణ్ లుక్‌ను, ఆట కూలీ అనే వృత్తిని కూడా చూపించారు. కొత్త లుక్ కాకపోవడంతో పెద్దగా ఆసక్తి కలిగించేది ఏమీ లేదు కానీ.. ఓ విషయం మాత్రం డిఫరెన్స్ కనిపించింది. అదే చరణ్ ట్యాగ్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో గ్లోబల్‌గా మంచి పేరు తెచ్చుకున్న రామ్‌చరణ్ ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వేసుకున్నాడు.
కానీ ఇప్పుడు ఆ ట్యాగ్‌ను వదిలేసి… మళ్ళీ పాత ట్యాగ్ ‘మెగా పవర్ స్టార్’కు వచ్చేశాడు. రీసెంట్ ఫ్లాప్, హిట్ సెంటిమెంట్ వదలకూడదు అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి తన పాత ట్యాగ్ తెచ్చేసుకున్నాడు అని అర్థమవుతోంది. ఈ విషయంలో అయితే చరణ్ టీమ్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. ఎందుకు ట్యాగ్ మార్చారు అనేది చెప్పలేదు. ఈ విషయం తెలియాలంటే చరణ్ మీడియా ముందుకు రావాలి. అది జరగాలంటే వచ్చే ఏడాది మార్చి నెల రావాలి.
ఎందుకంటే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ టాపిక్ వస్తే కచ్చితంగా తెలుస్తుంది.