గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ రిలీజ్ డేట్ మీద గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే గందరగోళం నడుస్తోంది. షూటింగ్ ఆలస్యం అవుతోందని, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల సినిమా మార్చి నుంచి మే నెలకు వాయిదా పడుతుందని రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ లో తెలియని టెన్షన్ మొదలైంది. అయితే ఇప్పుడు ఆ పుకార్లన్నింటికీ స్వయంగా మెగా పవర్ స్టారే ఫుల్ స్టాప్ పెట్టారు.
షూటింగ్ డిలే అవుతోందనే వార్తల్లో నిజం లేదని, పనులు పక్కా ప్లానింగ్ తో సాగుతున్నాయని చాంపియన్ ట్రైలర్ లాంచ్ లో చరణ్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లే మార్చి 27న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. దీంతో మే 1న వస్తుందనే ప్రచారానికి బ్రేక్ పడింది. చరణ్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
డేట్ విషయంలో క్లారిటీ రావడంతో ఇప్పుడు టీమ్ ఫోకస్ మొత్తం ప్రమోషన్స్ మీదకు మళ్లింది. సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా, పబ్లిసిటీని కాస్త ముందుగానే స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి టీజర్లు, మేకింగ్ వీడియోలను దశలవారీగా వదలడానికి ప్లాన్ చేస్తున్నారు.
మార్చి 27న సినిమా రావడం బాక్సాఫీస్ పరంగా కూడా చాలా ప్లస్ అవుతుంది. సమ్మర్ సీజన్ కు అది పర్ఫెక్ట్ ఓపెనింగ్ డేట్. పైగా అది చరణ్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఖాయం. కథ, విజువల్స్ పరంగా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందని, అందుకే ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని టాక్. మొత్తానికి చరణ్ ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఇండస్ట్రీలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఇక వాయిదాల ప్రసక్తే లేదు, అనుకున్న టైమ్ కి బుచ్చిబాబు, చరణ్ ల మాస్ జాతర మొదలవ్వడం పక్కా.
