‘ఆర్ఆర్ఆర్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కి మరింత ఉత్సాహాన్ని ఇవ్వడానికి మరో సినిమా రాబోతోంది. ‘ఆచార్య’ రూపంలో డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నారు. సినిమా విడుదలకు ఇంకో నెల రోజుల సమయం ఉండటంతో, ప్రచారం షురూ చేయాలని చూస్తున్నారట. కాస్త ‘ఆర్‌ఆర్‌ఆర్’ వేడి తగ్గగానే ‘ఆచార్య’ ప్రచారం మొదలెడతారు. ఈ సమయంలో ‘ఆచార్య’లో చరణ్ పాత్ర నిడివి ఇదే అంటూ ఓ పుకారు బయటికొచ్చింది. ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి కాకుండా మరో హీరోకు కూడా చోటుందని వార్తలు రావడం, చాలా మంది పేర్లు వినిపించి..
ఆఖరికి చరణ్ ఓకే అవ్వడం తెలిసిందే. తొలి రోజుల్లో చరణ్ పాత్ర నిడివి పది నిమిషాలలోపే అని కూడా అన్నారు. అంత చిన్న పాత్ర అయినా… తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసమే చరణ్ ఒప్పుకున్నాడని అన్నారు. అయితే అక్కడికి కొద్ది రోజులకు చరణ్ పాత్ర నిడివి పెరిగిందని వార్తలొచ్చాయి. ఆఖరికి ఆ పాత్ర నిడివి 20 నుండి 25 నిమిషాలు అని టాక్ నడుస్తోంది. చిరంజీవి – రామ్‌చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికే చూచాయగా చూపించారు దర్శకుడు కొరటాల శివ.
ఓ టీజర్‌లో ఓవైపు పులి, పులి పిల్ల… మరోవైపు చిరంజీవి, చరణ్‌ను చూపించారు. దీంతో ఫ్యాన్స్ గూస్‌బంప్స్ వచ్చేశాయి. అంతగా అదిరిపోయిందా ఆ సీన్. ఒక్క పది సెకన్ల ఫ్రేమే అలా ఉంటే.. సినిమా 25 నిమిషాల పాటు ఇద్దరూ కనిపిస్తారు అంటే ఆ హైనెస్ ఇంకా ఎలా ఉంటుందో ఇమేజిన్ చేసుకోండి. నీలాంబరి అంటూ… పూజా హెగ్డే చరణ్ చేసిన రొమాన్స్‌ను ఓ పాటలో చిత్రీకరించి ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా. చరణ్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు కూడా వినిపించాయి.
ధర్మస్థలి నేపథ్యంలో సాగే కథ ఈ సినిమా. దేవాదాయ శాఖలోని కీలక అంశాలను ఈ సినిమాలో చర్చిస్తున్నారని టాక్. కొరటాల శివ సినిమా అంటే ఇలానే ఉంటుంది కూడా. సందేశం, వినోదం కలగలసి ఉంటాయి. మరి ఈ సినిమాలో ఎలా ఉంటాయి అనేది ఏప్రిల్ 29న తెలుస్తుంది.