తాను చేస్తోన్న మసాలా సినిమాల మీద వెగటు పుట్టిందో లేక తోటి హీరోల సినిమాల ప్రభావమో కానీ ఇకపై చేసే సినిమాల్లో వైవిధ్యం ఉండాల్సిందే అని బలంగా నిర్ణయించుకున్నాడు రామ్ చరణ్. ఇప్పడు తమిళ సినిమా రీమేక్ చేస్తున్నా, తర్వాతి సినిమా కోసం సుకుమార్ తో చేతులు కలిపినా కొరటాల, మణిరత్నం వంటి దర్శకులతో మంతనాలు జరుపుతున్నా వాటి వెనుక దాగి ఉన్న అసలు కారణం అదే. అందులో భాగంగానే చరణ్ ఓ కౌబాయ్ కథపై బాగా కాన్షన్ట్రేట్ చేస్తున్నాడట. ప్రస్తుతం ధృవ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న రామ్ చరణ్ దొరికిన కొద్దిపాటి సమయంలో తర్వాతి సినిమాల కోసం కథలు వింటున్నాడట. ఇటీవల ఓ దర్శక రచయిత వినిపించిన కథలో కౌబాయ్ పార్ట్ చెర్రీకి తెగ నచ్చేసిందట.
దాంతో కథ ‘కౌబాయ్’ పాత్ర చుట్టూ నడిచేటట్టు మార్చే ప్రయత్నం చేయమని సూచించాడట. పైగా తానెప్పుడూ ఈ గెటప్ లో కనపడింది లేదని చెర్రీ కౌబాయ్ పాత్ర చేస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. స్వతహాగా గుర్రపు స్వారీని అమితంగా ఇష్టపడే చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ కి నాయకత్వం వహిస్తున్నాడు. అప్పట్లో తండ్రి చిరంజీవి ‘కొదమసింహం’లో ఈ తరహా పాత్ర చేయగా బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’లో ఓ పాటలో కౌబోయ్ గా దర్శనమిచ్చారు. ఇప్పుడు చెర్రీ వంతు వచ్చింది కాబోలు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ కాలంలో కౌబాయ్ కథలు వర్కౌట్ అవుతాయా అన్నదే ప్రశ్న. ఎందుకంటే టాలీవుడ్ లో కౌబాయ్ సినిమాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన వారసుడైన మహేశ్ బాబు పన్నెండేళ్ల కిందట ఇలాంటి ప్రయత్నం చేసినందుకే ప్రేక్షకులు పెదవి విరిచారు. అలాంటప్పుడు చరణ్ ఆ కథ కోసం పట్టుబట్టడం ఎంతవరకు సబబు అంటారు. ఇంతకీ ఈ సాహసానికి ఒడిగట్టిన దర్శకుడెవరో..?