ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యి యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ కొందరూ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్ కంటే ట్రైలర్ మరింత అద్భుతంగా ఉందని మెగా అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమా పై అంచనాల్ని పెంచేసిందనే చెప్పాలి. ఇక ఇటీవల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయం బయట నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
‘ ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుండీ తీసుకున్నారని.. తమ పొలాల్లో షూటింగ్ చేసి వాటిని నాశనం చేశారని…. ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఆ సమయంలో చరణ్ తమకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటామని కూడా మాట ఇచ్చారని… కానీ ఎటువంటి సహాయం చేయలేదని’ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయం పై స్పందించాడు చరణ్. ఆయన మాట్లాడుతూ.. “గతంలో ఉయ్యాలవాడ కుటుంబాలను కలిశాను.. వారితో మాట్లాడాను. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాల దాటిన తరువాత దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు.ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడిని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడమనేది నాకు అర్ధం కావడం లేదు. ఆయన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి.. ఉయ్యాలవాడ అనే ఊరి కోసం నిలబడ్డారు. ఏదైనా చేయాలనుకుంటే ఆ ఊరి కోసం చేస్తాను, ఆ జనం కోసం చేస్తానే తప్ప.. ఒక కుటుంబానికి లేదా నలుగురి వ్యక్తుల కోసం చేయను. అలా చేసి ఆయన స్థాయిని నేను తగ్గించను” అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.