ఈ ఏడు దసరా సీజన్లో నిలిచిన తొలి సినిమాగా రామ్ చరణ్ ‘ధృవ’ అని చెప్పుకోవచ్చు. ఓ హిట్ కోసం తపిస్తోన్న చరణ్ తమిళ చిత్రం ‘తనీ ఒరువన్’ రీమేక్ రూపంలో దాన్ని పొందాలనుకున్నాడు. నిన్నమొన్నటివరకు ఈ సినిమా దసరా విడుదల అనే బోర్డ్ నే తగిలించుకుని ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి విరుద్ధంగా వున్నాయి.
ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకణ ఇంకా పూర్తి కాలేదట. ముఖ్యంగా అరవింద్ స్వామి-రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు. మాతృకలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే ఏరికోరి ఈ సినిమాకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం దృష్ట్యా షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో నెలలో విడుదల చేయడం కోసం సినిమాని చుట్టేయడానికి చిత్ర బృందం సంసిద్ధంగా లేదు. ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మిస్తోన్న అల్లు అరవింద్ వాయిదా వేయడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారట. తద్వారా నిర్మాణాంతర కార్యక్రమాలకు, ప్రచారానికి సమయం లభిస్తుందని గీతా ఆర్ట్స్ వర్గాలు భావిస్తున్నాయట. ఎటూ దసరా, దీపావళి పండగలకు సినిమాలు దండిగా వున్నాయి. అంచేత ధృవ విడుదలకు డిసెంబర్ తగిన సమయమని నిర్ణయించుకున్నారట. సో.. ధృవ దసరా బరిలో లేనట్టే.