ప్రతిరోజు ఎవరినో ఒకరిని గిల్లనిదే రామ్ గోపాల్ వర్మకు నిద్రపట్టదు. అందుకే వర్మ బయోపిక్ తీస్తున్న రచయిత జొన్నవిత్తుల టైటిల్ గా ఆర్ జి వి ట్యాగ్ లైన్ లో రోజూ గిల్లే వాడు అని పెట్టాడు. బహుశా వర్మ స్వభావానికి ఈ టైటిల్ చక్కగా సరిపోతుంది అనడంలో సందేహం లేదు. కాగా వర్మ ఈ సారి టాలీవుడ్ ప్రముఖులపై సెటైర్ వేశారు. లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంటిలో ఉండి ఇల్లు ఊడవడం, పాత్రలు కడగడం, వంట చేయడం మరియు బట్టలు ఉతకడం చేస్తే తాను ఓ మూవీ తీశానని ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ పై వర్మ ఓ మూవీ తీశాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదల చేశాడు. వర్మ తన ఆలోచనలతో కొద్దిమంది నటులతో కరోనా వైరస్ పై లాక్ డౌన్ సమయంలో మూవీ తీశాడు. ఐతే ఇక్కడ ఆయన టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేయడం గమనించదగిన అంశం. కొద్దిరోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో టాలీవుడ్ ప్రముఖులు అందరూ కలిసి రియల్ మెన్ ఛాలెంజ్ పేరుతో ఓ టాస్క్ నిర్వహించారు.
లాక్ డౌన్ లో కట్టు కున్న భార్యలకు, కన్నవారికి సాయంగా ఉండాలని ఇంటి పనులు వారే స్వయంగా చేశారు. డైరెక్టర్ సందీప్ రెడ్డితో మొదలైన ఈ ఛాలెంజ్ ని ఎన్టీఆర్, చిరు, వెంకీ, రాజమౌళి, చరణ్ వంటి స్టార్స్ తో పాటు కొందరు డైరెక్టర్స్ కూడా చేశారు. ఇప్పుడు వారిని ఉద్దేశించి వర్మ సెటైర్ వేశారు. అవి ఎవరైనా చేస్తారు నాలా మూవీ తీయాలని వారికి ఛాలెంజ్ విసిరాడు.