లావణ్య త్రిపాఠి ఎక్కడమ్మాయో తెలుసా? అనగానే టకటకా వికీపీడియా ఓపెన్ చేసి ఉత్తరప్రదేశ్‌లో పుట్టింది, ఉత్తరాఖండ్‌లో పెరిగింది, ముంబయిలో చదివింది… అని చెప్పేయొద్దు. ఎందుకంటే ఆమె పుట్టింది అక్కడ రాసున్నట్లు ఉత్తరప్రదేశ్‌లో కాదట. అవును, నిజం.. ఆమె పుట్టింది మన తూర్పు గోదావరి జిల్లాలోనట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. ఆమె నటించిన అనుభవం ఉన్న రామ్. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ప్రి రిలీజ్ వేడుకకు వచ్చిన రామ్ ఈ విషయాన్ని చెప్పాడు.
లావణ్య త్రిపాఠితో మాట్లాడే వాళ్లకు ఆమెలోని ఎటకారం గురించి బాగా తెలుస్తుంది అంటుంటారు టాలీవుడ్ జనాలు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు గతంలో ఈ విషయం అన్నారు. దాని వెనుక అసలు కారణం ఇప్పుడు తెలిసొచ్చింది. పుట్టింది తూ.గో.లో కదా.. ఆ మాత్రం ఎటకారం ఉంటుంది లెండి. మరి ఉత్తరాఖండ్‌కి చెందిన లావణ్య త్రిపాఠి తూర్పు గోదావరి జిల్లాలో పుట్టడం ఏంటనేది తెలియడం లేదు. ఈసారి ఆమె ఇంటర్వ్యూ పెడితే అడిగి తెలుసుకుందాం.
అన్నట్లు ఇదే వేదిక మీద రామ్ నిర్మాతల్ని తెగ పొగిడేశాడు. దానికి కారణాలు చెప్పాడనుకోండి. ‘‘ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలే నిజమైన హీరోలు. కరోనా సమయంలో వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి’’ అని చెప్పాడు రామ్. మరి రామ్‌కి ఉన్నపళంగా నిర్మాతల మీద ఇంత ప్రేమ ఎందుకొచ్చిందో చూడాలి.