సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక హీరోతో అనుకున్న సినిమా తర్వాత మరో హీరోతో చేయడం.. దర్శకులు మారడం.. అనుకోకుండా ఒకేసారి ఒకే తరహా కథలతో చిత్రాలు తెరకెక్కడం.. ఆ విషయం తెలిశాక ఎవరో ఒకరు వెనక్కి తగ్గడం అనేది జరుగుతుంటుంది. ఇటీవల కాలంలో రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ప్లాన్ చేశారు. అంతకుముందే ఇదే కథతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మూవీ అనౌన్స్ చేసి.. అసలు విషయం తెలిసి వెనక్కి తగ్గారు.
గతంలో విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ పిక్చర్ ‘సూర్యవంశం’ సమయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు, మూవీ మొఘల్ డా.డి. రామా నాయుడు, యాంగ్రీ స్టార్ డా. రాజ శేఖర్, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి వంటి హేమా హేమీల మధ్య జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూద్దాం.. సూపర్ గుడ్ ఫిలింస్ వారు అప్పట్లో తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి వరుసగా భారీ హిట్స్ కొట్టేవారు.
ఆ రకంగా వాళ్లకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ‘సూర్యవంశం’ తెలుగులో రీమేక్ అని ప్రకటించాక.. దాసరి.. అటువంటి కథను తాను రెండేళ్ల క్రితమే రాసుకున్నానని.. తెలుగులో ఎవరైనా తీస్తే తానూ పోటీగా తీస్తాననీ, పోటీగా విడుదల చేస్తాననీ హెచ్చరిస్తూ.. అప్పుడు ఖాళీగా ఉన్న రాజ శేఖర్‌ని హీరోగా బుక్ చేసుకున్నారు. అది తెలిసి వెంకటేష్ తండ్రి రామా నాయుడు, నిర్మాత ఆర్.బి.చౌదరి ఇద్దరూ రాజ శేఖర్‌ని సంప్రదించి..
‘నువ్వే మా హీరోవి’ అంటూ ఒకరు తమిళ్, మరొకరు తెలుగు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనుకున్న రాజ శేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకటేష్‌కి పోటీ రాకుండా ఎంచక్కా రెండు భాషల్లో సినిమాలు చేసుకోవచ్చంటూ పార్టీ ఫిరాయించేశాడు రాజ శేఖర్.ఈ ఆసక్తికరమైన సంఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.