మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్,కలయికలో రూపుదిద్దుకున్న సినిమా “రంగస్థలం”. 1980 నాటి కథలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ ‘చిట్టిబాబు’గా, సమంత ‘రామలక్ష్మి’గా నటించి అదరగొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై ఘన విజయం సాధించింది. ఒక్క తెలుగు భాషలోనే రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైనే గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక షేర్ కూడా 120 కోట్లకు పైనే రాబట్టి అధిక లాభాలను అందించింది. ఈ లెక్కలు ఇంతటితో ఆగిపోవడంలేదు. ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ కథని ఇతర భాషల వారు రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా చరణ్ ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” రంగస్థలం సినిమాని చైనా భాషలో అనువదించే పనిలో చిత్ర బృందం ఉంది. త్వరలోనే అక్కడ రిలీజ్ చేస్తాం” అని అన్నారు.
మన దేశానికి చెందిన సినిమాలను చైనా ప్రజలు ఆదరిస్తున్నారు. బాలీవుడ్ దంగల్ మూవీకి అయితే బ్రహ్మరధం పట్టారు. భారీ హిట్ అందించారు. బాహుబలి కంక్లూజన్ గ్రాండ్ గా రిలీజ్ అయినప్పటికీ ఆశించినంత ఆదరణ లభించలేదు. మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెస్ వారికీ కొత్త కాదు కాబట్టి బాహుబలి వారిని ఆశ్చర్యపర్చలేకపోయిందని సినీ విశ్లేషకులు తేల్చారు. ఇక రంగస్థలం పక్క ఎమోషనల్ డ్రామా కాబట్టి తప్పకుండా చైనీయుల మనసుదోచుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ హిట్ అయితే వసూళ్ల లెక్కల్లో కొత్త రికార్డులు నెలకొల్పడం గ్యారంటీ.