తనకు “సోగ్గాడే చిన్ని నాయన”తో హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మీద ఉన్న నమ్మకంతో.. తన తనయుడు నాగచైతన్య భవిష్యత్ కూడా కళ్యాణ్ కృష్ణ చేతిలో పెట్టాడు నాగార్జున. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపొందిన చిత్రమే “రారండోయ్ వేడుక చూద్ధాం”. చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : భ్రమరాంభ (రకుల్ ప్రీత్ సింగ్) ఇంటి మొత్తానికి ఒక్కగానొక్క చిన్నారి కావడంతో చాలా అల్లారుముద్దుగా పెంచుతారు. అందువల్ల తాను ఆడిండే ఆట, పాడిండే పాట అన్నట్లుగా తయారవుతుంది అమ్మడు. అందుకు తండ్రి గారాబం కూడా తొడవ్వడంతో ఆమెకు అడ్డూ ఆపూ లేకుండా పోతుంది. బంధువుల పెళ్ళిలో పరిచయమవుతాడు శివ (నాగచైతన్య). తొలిచూపులోనే భ్రమరాంభను ప్రేమించేస్తాడు. అయితే.. ఆ విషయం భ్రమకు చెబితే.. ఆమె ఎక్కడ మాట్లాడడం మానేస్తుందేమో అన్న భయంతో స్నేహంగా మెలుగుతుంటాడు.
ఇక పరిస్థితులు చేతులు దాటుతున్నాయనుకొంటున్న సమయంలో తన ప్రేమ విషయం భ్రమకు చెబుతాడు శివ. శివ ప్రేమను భ్రమరాంభ అంగీకరించిందా? లేదా? వారిద్దరి పెళ్ళికి అడ్డంకిగా నిలిచిన విషయం ఏంటి? అనేది “రారండోయ్ వేడుక చూద్దాం” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : నాగచైతన్యలోని యాక్టింగ్ స్కిల్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకొన్న చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం”. హీరో క్యారెక్టరైజేషన్ ను దర్శకుడు డిజైన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా.. బీచ్ సీన్ లో రకుల్ పై కోపంతో చెలరేగిపోయే సన్నివేశంలో చైతూ నటన విశేషంగా ఆకట్టుకొంటుంది. యూత్ కూడా ఆ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
రకుల్ కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ “భ్రమరాంభ”. చిలిపిదనం, కరుకుదనం, మొండితనం అన్నీ కలగలిసిన పదహారణాల పల్లె పడుచులా రకుల్ ఆకట్టుకొంది. కొన్ని సన్నివేశాల్లో మేకప్ సెట్ అవ్వక కాస్త పెద్దాడానిలా కనిపించిందే కానీ.. ఓవరాల్ గా నటిగా మంచి మార్కులు దక్కించుకొంది. సగటు భార్యా బాధితుడిగా వెన్నెల కిషోర్ విశేషంగా కాకపోయినా.. ఓ మోస్తరుగా నవ్వించాడు. ఇంకా బోలెడుమంది కామెడియన్లు ఉన్నప్పటికీ.. వారిని సరిగా వినియోగించుకోలేకపోయాడు దర్శకుడు. జగపతిబాబు-సంపత్ లు బిడ్డలను అమితంగా ప్రేమించే తండ్రులుగా పాజిటివ్ రోల్స్ లో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ బాణీలు-బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్స్ గా పేర్కొనవచ్చు. “తకిట తకిధిం”తోపాటు టైటిల్ ట్రాక్ కూడా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాలోని ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేశాడు. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. వైజాగ్ అందాలను, బీచ్ ఫైట్ సీక్వెన్స్ ను బాగా చిత్రీకరించాడు. ఎడిటర్ తన కత్తెరకు కాస్త ఎక్కువ పని చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. సినిమా నిడివి మరీ 150 నిమిషాలు అవ్వడంతో.. కథనంలో వేగం తగ్గి కాస్త బోర్ కొట్టించింది. కొన్ని సన్నివేశాలను కత్తిరించి నిడివిని ఓ 15 నిమిషాలు తగ్గిస్తే సినిమాకి ప్లస్ అవుతుంది. నాగార్జున నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా.. కథకు ఎంత కావాలో అంత ఖర్చు చేశారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ క్యారెక్టరైజేషన్ లు రాసుకోవడంలో చూపిన శ్రద్ధ కాస్త కథ-కథనాలపై కూడా చూపి ఉంటే సినిమా ఔట్ పుట్ ఇంకో స్థాయిలో ఉండేది. అయితే.. హీరోయిన్ పాత్ర చుట్టూ కథను అల్లుకొన్న విధానం బాగుంది. అయితే.. హీరోహీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ ఇంకాస్త పండించి ఉంటే ఆడియన్ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కథ కావడంతో మాస్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడా కనిపించలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణ తన ఖాతాలో మరో విజయాన్ని అందుకొన్నాడని చెప్పొచ్చు!
విశ్లేషణ : కుటుంబసభ్యులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి ఆనందించదగ్గ చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం’. మాస్-యూత్ ఆడియన్స్ కి కాస్త బోర్ కొట్టే అవకాశాలున్నాయేమో కానీ.. సినిమా మాత్రం నిజంగానే ఓ కుటుంబ వేడుకను తలపిస్తుంది.