శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో ప్రస్తుతం ఈ హీరోయిన్ 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ హీరోయిన్ కు ఆఫర్లు వస్తున్నాయి. అయితే రష్మిక తను హీరోయిన్ గా నటించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయితే ఆ సినిమాలకు నో చెబుతోందని తెలుస్తోంది.
సాధారణంగా దర్శకనిర్మాతలు ఒరిజినల్ వెర్షన్ లో నటించిన హీరోయిన్లనే ఇతర భాషల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కిరిక్ పార్టీ హిందీ రీమేక్ కోసం దర్శకనిర్మాతలు రష్మికను సంప్రదించగా ఆమె నో చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రీమేక్ లో నటించకపోవడానికి గల కారణాన్ని సైతం రష్మిక వెల్లడించారు. తన దృష్టిలో ఏ పాత్రలోనైనా తొలిసారి చేస్తే మాత్రమే ఎమోషన్స్ అద్భుతంగా పండించగలమని రష్మిక అన్నారు. ఒకే పాత్రలో మళ్లీ నటించడం తన వల్ల కాదని ఆమె వెల్లడించారు.
తాను కొత్త పాత్రలు, కొత్త కథలలో నటించడానికే ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ కారణం వల్లే కిరిక్ పార్టీ రీమేక్ లో తాను నటించలేనని రష్మిక వెల్లడించారు. మరోవైపు పుష్ప సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. రష్మికకు వరుసగా పల్లెటూరి అమ్మాయి పాత్రలే వస్తుండటం గమనార్హం. ఇటీవల సుల్తాన్ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. సుల్తాన్ రిజల్ట్ రష్మికకు షాక్ ఇవ్వగా పుష్పతో రష్మిక సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.