మాస్ మహారాజ్ రవితేజకి (Ravi Teja) ఈ మధ్య సరైన హిట్టు పడలేదు. ‘ధమాకా’ (Dhamaka) తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన రవితేజ.. ఆ తర్వాత ‘రావణాసుర'(Ravanasura) ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ‘ఈగల్’ (Eagle) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వంటి డిజాస్టర్లు ఇచ్చాడు. మధ్యలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) హిట్ అయినా దాని క్రెడిట్ మొత్తం చిరు, సంక్రాంతి సీజన్ అకౌంట్లో పడిపోయింది. సరే ప్లాపుల సంగతి ఎలా ఉన్నా.. రవితేజతో మరికొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి పారితోషికం.
సినిమా హిట్.. ప్లాప్ అనే తేడా లేకుండా అతను పారితోషికం పెంచుకుంటూ పోతున్నాడు. ‘మిస్టర్ బచ్చన్’ కి అతను రూ.25 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న ‘మాస్ జాతర’ కి (Mass Jathara) కూడా అంతే..! తర్వాత ‘మైత్రి’ లో చేయాల్సిన సినిమాకు రూ.30 కోట్ల వరకు డిమాండ్ చేశాడు రవితేజ. అంత మొత్తం ఎందుకు అంటే.. ‘తనకు హిందీ మార్కెట్ ఉందని’ తెలిపినట్టు అప్పట్లో టాక్ నడిచింది. మరోపక్క అతని సినిమాలు భారీ రేట్లు పెట్టి కొనడానికి ఓటీటీ సంస్థలు కూడా వెనకడుగు వేశాయి.
దీంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే కథని అదే దర్శకుడితో ‘జాట్’ గా (Jaat) తీశారు ‘మైత్రి’ వారు. దీంతో సమస్య గమనించిన రవితేజ ఇప్పుడు తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి డిసైడ్ అయ్యారు అని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. రవితేజ తన నెక్స్ట్ సినిమాని కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనికి సుధాకర్ చెరుకూరి నిర్మాత.
ఆగస్టు నుండి షూటింగ్ మొదలుకానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం రవితేజ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. తర్వాత బిజినెస్ పై కొంత వాటా కూడా అడిగినట్టు సమాచారం. సో పారితోషికం పరంగా రవితేజ కొంచెం తగ్గినట్టే చెప్పుకోవాలి.