Ravi Teja: రవితేజ కొత్త చిత్రం ఓకే… ఈసారీ సంక్రాంతి మీదే గురి!

‘‘ఆదాయం.. చెప్పన్‌ తియ్‌, వ్యయం.. లెక్క జెయ్యన్‌, రాజపూజ్యం అన్‌ లిమిటెడ్‌, అవమానం.. జీరో’’ .. ఏంటిది రాశిఫలం ఇలా ఉంది. ఇలా ఎవరూ, ఎక్కడ చెప్పరు కదా అనుకుంటున్నారా? అవును మీరు అన్నది కరెక్టే ఇది రాశిఫలం కాదు, కాని రాశిఫలమే… అయితే సినిమా రాశిఫలం. మాస్‌ మహరాజ్‌ రవితేజ (Ravi Teja) కొత్త సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. అందులో చెప్పిన మాటలే ఇవి. అన్నట్లు ఇది రవితేజ 75వ సినిమా.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రవితేజ కొత్త సినిమా ఉంటుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఆ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించనున్నారు. రవితేజ ఈ సినిమాలో లక్ష్మణ్‌ భేరి అనే పాత్రలో కనిపిస్తాడు. పోస్టర్‌ మీద ఉన్న కంటెంట్‌ ప్రకారం చూస్తే… ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది అని అర్థమవుతుంది.

‘‘2025 సంక్రాంతికి రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’’ అంటూ ఆ పోస్టర్‌ మీ సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి కూడా రాసేశారు. ఇక ఎప్పటిలాగే సితార బ్యానర్‌తోపాటు ఈ సినిమాను త్రివిక్రమ్‌ (Trivikram) ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ భాగమయ్యాయి. ఈ విషయం పక్కన పెడితే రవితేజ మళ్లీ సంక్రాంతి బరిలో నిలవడం ఈ సారి ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది బరిలో నిలిచి పక్కకు వచ్చేశాడు కాబట్టి.

‘ఈగల్‌’ (Eagle) సినిమాతో ఈ ఏడాది పొంగల్‌ ఫైట్‌లో ఎర్లీ డేస్‌లో నిలిచిన రవితేజ… ఆ తర్వాత వివిధ పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తగ్గారు. లేటుగా వచ్చి ఫలితం విషయంలో ఇబ్బందిపడ్డారు కూడా. దీంతో వచ్చే పెద్ద పండగ ఫైట్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), వెంకటేశ్‌ (Venkatesh) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సినిమాలు ఆ డేట్ మీద ఇప్పటికే కర్చీఫ్‌ వేసేశాయి. అన్నట్లు నాగార్జున (Nagarjuna) కూడా పొంగల్‌కి మళ్లీ వస్తాం అని మొన్నామధ్య ప్రకటించాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus