జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని చిత్ర బృందం ఇదివరకు ప్రకటించింది. అయితే షూటింగ్ పోస్ట్ పోన్ అయినట్లు తాజా సమాచారం. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఈ చిత్రంలో తారక్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్రకోసం బాడీ చాలా ఫిట్ గా ఉండాలని జిమ్ లోనే ఎక్కువ సేపు గడిపి లుక్ ను పూర్తిగా మార్చేశారు.
ఆ లుక్ కి సంబంధించిన ఫోటోలు గతవారం సోషల్ మీడియాలో కనిపించి లైకులు అందుకుంది. షూటింగ్ కి ఎన్టీఆర్ సిద్ధమయిపోయారని అభిమానులు సంబరపడ్డారు. అయితే దర్శకుడు కోరుకున్న లుక్ రావడానికి మరికొంత సమయం అవుతుందట. అందుకోసమే త్రివిక్రమ్ షూటింగ్ ని వాయిదా వేసినట్లు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28వ సినిమాకి థమన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే ఖరారు అయింది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.