అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. నిజానికి నాగచైతన్య సినిమాల బిజినెస్ పాతిక నుండి ముప్పై కోట్ల మధ్యలోనే జరుగుతుంటుంది.
ఎంత బజ్ వచ్చినా.. నలభై కోట్ల మార్కెట్ ని మించి జరగదు. కానీ తొలిసారి ‘లవ్ స్టోరీ’ సినిమా ఈ మార్క్ ని దాటేసింది. ఆంధ్రాలో ఈ సినిమాను రూ.15 కోట్లకు అమ్మేశారు. చైతు కెరీర్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆరు కోట్ల బిజినెస్ జరిగింది. ఇది కూడా రికార్డే. నైజాంలో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. అక్కడ అమ్మినా కూడా మంచి రేటే పలికేది. మొత్తం సినిమా బిజినెస్ లెక్కలు చూసుకుంటే రూ.50 కోట్ల మార్క్ ని టచ్ చేసిందని చెబుతున్నారు.
మొత్తానికి చైతు సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషం. ఇంత బిజినెస్ జరగడానికి మరో కారణం కూడా ఉంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ మంచి సక్సెస్ అయింది. ఆ క్రేజ్ ఈ సినిమాకి కూడా ప్లస్ అయింది. సినిమా హిట్ అయితే మాత్రం క్రెడిట్ చైతు ఖాతాలోకి వెళ్లడం ఖాయం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాను ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.