“లవ్ టుడే”తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్”. “ఓ మై కడవులే” ఫేమ్ అశ్వథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద మంచి అంచనాలున్నాయి. మరి సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: స్కూల్లో గుడ్ బాయ్ గా ఉంటే ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందనే కోపంతో ఇంజనీరింగ్ కాలేజ్ లో బ్యాడ్ బాయ్ డ్రాగన్ గా మారతాడు రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్). 48 బ్యాక్ లాగ్స్ తో కాలేజ్ నుండి ఎగ్జిట్ అయిన రాఘవన్ కి మంచి లైఫ్ లీడ్ చేయాలనే ధ్యేయం మాత్రం ఉంటుంది. అందుకోసం ఫేక్ సర్టిఫికెట్ పెట్టి మరీ ఉద్యోగం సంపాదిస్తాడు. కష్టపడి పని చేసి మంచి జీవితాన్ని గడుపుతుండగా.. కాలేజ్ ప్రిన్సిపాల్ (మిస్కిన్) రీఎంట్రీ ఇచ్చి.. 3 నెలల్లో 48 బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయకపోతే, ఫేక్ సర్టిఫికెట్ విషయం అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు.
దాంతో మళ్లీ కాలేజ్ లో జాయినవుతాడు రాఘవన్. ఆ తర్వాత అతడి ప్రయాణం ఎలా సాగింది? అనేది “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రదీప్ రంగనాథన్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ ఇది. చాలా సహజమైన నటనతో పాత్రలో ఒదిగిపోయాడు. అయితే.. క్యారెక్టర్ ఆర్క్ అనేది సరిగా వర్కవుట్ అవ్వకపోవడంతో ఆ పాత్రతో ఆడియన్స్ ట్రావెల్ చేయలేరు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కంటే సపోర్టింగ్ రోల్ అని చెప్పాలి. ఫస్టాఫ్ లో ఆమె క్యారెక్టర్ కు సరైన జస్టిఫికేషన్ లేకపోయినా.. సెకండాఫ్ లో ఆ పాత్ర చుట్టూ అల్లిన డ్రామా వర్కవుట్ అయ్యింది.
కడాయు లోహార్ మంచి గ్లామర్ యాడ్ చేసింది. అయితే ఆమె పాత్రను సరిగా ఎక్స్ ప్లోర్ చేయలేదు.
అలాగే.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ & మిస్కిన్ పాత్రలతో డ్రామా పండలేదు. అందువల్ల వాళ్ళు చక్కగా నటించినా సరైన స్థాయిలో వారి పాత్రలు ఆకట్టుకోలేకపోయాయి.
అమాయక తండ్రి పాత్రలో జార్జ్ నటన బాగా గుర్తుండిపోతుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించినవాళ్లందరూ అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ ఎప్పుడూ బాగుంటుంది. వీలైనంత నేచురల్ లైటింగ్ తో తెరకెక్కించడం అనేది సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. లియోన్ జేమ్స్ పాటలు బాగున్నా, ప్లేస్మెంట్ బాగోక సరిగా కనెక్ట్ అవ్వలేదు. నేపథ్య సంగీతం మాత్రం మంచి ఎనర్జీ నింపింది. ప్రొడక్షన్ డిజైన్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడంతో చాలా క్వాలిటీ అవుట్ పుట్ వచ్చింది.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. విజయంలో నిజాయితీ ఉండాలి అనే ఒక కోర్ పాయింట్ కి వాల్యూ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ ను సినిమాగా తెరకెక్కించిన విధానంలో చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. హీరో క్యారెక్టర్ చాలా ఈజీ సెటిల్ అయిపోవడం, ఎక్కడా పెద్దగా సమస్యలు లేకపోవడం, వచ్చిన సమస్యలు కూడా చాలా సింపుల్ గా పరిష్కారం అయిపోవడం అనేది మరీ సినిమాటిక్ గా ఉంటుంది. ఎండింగ్ కూడా అలాగే ఉండి ఉంటే.. లాజిక్స్ అవసరం లేని మ్యాజికల్ సినిమాగా ఉండిపోయేదేమో కానీ క్లైమాక్స్ లో హీరో తన తప్పును అందరి ముందు ఒప్పుకొని మంచి జీవితాన్ని నాశనం చేసుకొని నెలకి 3 లక్షలు సంపాదించే ఒకడు 30 వేల కోసం ఫుల్ డెలివరీ బాయ్ గా మారిపోవడం అనేది అస్సలు సింక్ అవ్వలేదు. అంత లాజికల్ & ఎమోషనల్ గా తెరకెక్కించాలి అనుకున్నప్పుడు అది ముందు నుంచే ఉండాలి. అలాగే.. క్లైమాక్స్ ను మరీ 20 నిమిషాలు సాగదీయడం కూడా కథకుడిగా అశ్వథ్ దర్శకత్వ ప్రతిభను ప్రశ్నించేలా చేసింది. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.
విశ్లేషణ: ఒక రెగ్యులర్ స్టోరీతో మంచి మెసేజ్ ఇవ్వాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇంకా చెప్పాలంటే ఈ తరహా కామెడీ మిక్స్ చేసి ఇచ్చే మెసేజులు చాలా త్వరగా రీచ్ అవుతాయి. అయితే.. ఆ మెసేజ్ లో ఉన్న నిజాయితీ, చెప్పే విధానంలోనూ ఉండాలి. అది లోపించడం, సినిమాలో చాలా సీన్స్ & డ్రామా అనవసరంగా సాగడం వంటి కారణాల వల్ల “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: మెసేజ్ బాగుంది.. మ్యాటర్ మిస్ అయ్యింది!
రేటింగ్: 2.5/5