భలే భలే మగాడివోయ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయిన మారుతి తన దగ్గర ఉన్న చిన్న సినిమాల కథలను అప్ కమింగ్ డైరెక్టర్స్ కు ఇచ్చి తన నిర్మాణ సారధ్యంలో కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నాడు. అలా తెరకెక్కిన చిత్రం ‘రోజులు మారాయి’. ఈ చిత్ర కథ నచ్చి దిల్ రాజు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. పార్వతీశం, చేతన్ హీరోలుగా, కృతిక, తేజశ్వి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో ఎవరి రోజులు ఎలా మారాయో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..!
కథ : సత్య(కృతిక), రంభ(తేజశ్వి) హాస్టల్ లో ఉంటూ.. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరూ అబ్బాయిలతో ప్రేమ నటిస్తూ.. వారి దగ్గర డబ్బులు తీసుకొని మరొకరిని ప్రేమిస్తుంటారు. అయితే ఒకసారి శ్రీశైలంలో ఓ స్వామీజీని కలుసుకున్న వీరికి తమను పెళ్లి చేసుకున్న వారు మూడు రోజుల్లో చనిపోతారని తెలుస్తుంది. అప్పుడు సత్య, రంభలు తాము ప్రేమించిన వారిని కాకుండా తమని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని వారు చనిపోయిన తరువాత తమ లవర్స్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ దోష ప్రభావం కారణంగా పీటర్ (పార్వతీశం), అశ్వధ్ (చేతన్)లను పెళ్లి చేసుకుంటారు. మరి పీటర్, అశ్వద్ లు ప్రాణాలను పోగొట్టుకుంటారా..? సత్య, రంభలు తాము ప్రేమించిన వారిని మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? అనేదే ఈ సినిమా.
నటీనటుల పెర్ఫార్మన్స్ : ఈ సినిమాలో తేజశ్వి, పార్వతీశంలు తప్ప మిగిలిన వారెవ్వరికీ నటన రాదని సినిమా మొదలవ్వగానే తెలిసిపోతుంది. పార్వతీశం విజయనగరం స్లాంగ్ లో మాట్లాడి ప్రేక్షకులందరినీ నవ్వించాడు. తేజశ్వి తన నటనతోనే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయం. ఇక కృతిక దృశ్యం, రామయ్య వస్తావయ్యా సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమే. రెండు సినిమాల్లో నటించినా.. తన నటనలో మాత్రం కొత్తదనం లేదు. అశ్వద్ అనే పాత్రలో నటించిన చేతన్ కు ఇది మొదటి సినిమా. రెండు, మూడు సీన్స్ లోనే తనకు నటన రాదనే విషయం అర్థమయిపోతుంది. దాన్ని మ్యానేజ్ చేయడానికి చాలానే కష్టపడ్డాడు. బంచిక్ బాబాగా అలీ కామెడీ రోత పుట్టించిందనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు : జె.బి అందించిన సంగీతంలో కొత్తదనం లేదు సరి కదా… ఇంతకముందు ఎక్కడో విన్నామే.. అనే ఫీయింగ్ కలగక మానదు. ఫొటోగ్రఫీ మాత్రం కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమాకు పెద్ద మైనస్ కథ,కథనం. మారుతి అందించిన కథ అర్ధంకాక డైరెక్టర్ అలా ఎగ్జిక్యూట్ చేసాడో.. లేక అతనికి క్లారిటీ లేక చేసాడో గానీ మొత్తానికి స్టోరీ, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ మితిమీరాయనే చెప్పాలి. డైరెక్టర్ గా మురళీకృష్ణ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా సో.. సో.. గా ఉన్నాయి.
విశ్లేషణ : అమ్మాయిలు, అబ్బాయిల జీవితాలతో ఆడుకోవడం అనే కాన్సెప్ట్ తీసుకొని దానికి చిన్న ట్విస్ట్ జోడించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సినిమా తీసేశారు. ఇటువంటి సినిమాలు కొందరి ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకోగలవు. పార్వతీశం చెప్పే డైలాగ్స్ కొద్దిసేపటి వరకు నవ్వు తెప్పించినా.. తర్వాతర్వాత బోర్ కొట్టించేశాయి. గంటసేపు సినిమాను పొడిగించాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు. ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్స్ ను చాలా సినిమాల్లో చూసేశాం. కాబట్టి కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చదనే చెప్పాలి..!