‘మా’ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. తాజాగా ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వైసీపీ లీడర్లు, రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికలను ప్రభావితం చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే కోరారు.
ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ ఓ లేఖ రాశారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో సామాజిక వ్యతిరేకుల ఉనికి ఉందంటూ ప్రశ్నించామని.. అలాంటి వారిని కౌంటింగ్ ప్రాంతాలకు అనుమతించారని చెబితే.. ఆ ఆరోపణలను మీరు ఖండించారంటూ ఈసీ రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. విష్ణు ప్యానెల్ నుంచి చాలామందిని నల్ల బ్యాడ్జీలతో ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ‘మా’కి సంబంధం లేని వ్యక్తులను అనుమతించకూడదు కానీ అవేవీ పట్టించుకున్నట్లు కనిపించలేదని ప్రకాష్ రాజ్ లేఖలో ఆరోపించారు.
ప్రధానంగా ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్ నూకల సాంబశివరావు పాల్గొన్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇతడిపై జగ్గయ్యపేట పీఎస్ లో రౌడీ షీట్ ఉంది. గతంలో ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఎన్నో బెదిరింపులు, సెటిల్మెంట్ల కేసులు ఉన్నాయి. నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలిస్తుండగా.. అడ్డుకోబోయిన ఎస్సైని కారుతో ఢీకొట్టాలని చూశాడు. అలాంటి వ్యక్తి ‘మా’ ఎన్నికల రోజుల పోలింగ్ సమీపంలోనే తిరిగాడు. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయని.. అందుకే స్పష్టమైన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు.