టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్లలో పెద్ద కుదుపు వచ్చిందా…. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏయే సినిమాలు విడుదల తేదీలు మార్చుకుంటాయి అనేది చూద్దాం. అయితే దీనంతటి కారణం అయిన సినిమా గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఆ సినిమానే ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా కొత్త విడుదల తేదీ జనవరి 7, 2022 అని తాజాగా ప్రకటించారు. చాలా చర్చలు జరిపాక ఈ డేట్ ఇచ్చుండొచ్చు. అయితే డేట్ వచ్చాక చర్చలు మాత్రం అదిరిపోతున్నాయి.
2022 సంక్రాంతికి భారీ చిత్రాలు వరుస కట్టాయి. మొత్తంగా మూడు సినిమాలు సంక్రాంతికి వస్తాయి అని తేల్చేశారు. ‘భీమ్లా నాయక్’.. జనవరి 12న, ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’, జనవరి 14న వస్తాయని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల రిలీజ్ డేట్లు చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ కొత్త డేట్ రావడంతో ఆ సినిమాలు చెప్పిన డేట్స్‌కు వస్తాయా అనేది అనుమానంగా మారింది.
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మొదటి స్థానంలో ఉంది. క్రేజ్ పరంగా చూసినా, బడ్జెట్ పరంగా చూసినా భారీతనం మామూలుగా ఉండదు. అలాంటి సినిమా వచ్చిన ఐదు రోజులకు, వారం రోజులకు మరో పెద్ద సినిమా రావడం పరిశ్రమకు అంత మంచిది కాదు అంటుంటారు. ఆ సినిమాకు వచ్చేవసూళ్లు ఆ నిర్మాతకే కాకుండా, పరిశ్రమకూ చాలా ముఖ్యం. అలాగే థియేటర్లు దొరకడమూ కష్టం.
ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట2, ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్లు మారుస్తారని వార్తలొస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తారని టాక్. మార్చి, ఏప్రిల్‌లో ‘భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట’ వస్తాయని అంటున్నారు. ఇవి కాకుండా మిగిలిన పెద్ద సినిమాలు కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు దారి ఇస్తాయి అని కూడా అంటున్నారు. అన్నట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం తమ సినిమా థియేటర్లలో ఎత్తేయకూడదనే ‘పుష్ప’ కాస్త ముందుకు జరిపారనీ అంటున్నారు.