“నా ప్రతి సినిమాలో మా మావయ్యలు చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్ గార్లను ఇమిటేట్ చేస్తున్నాను అని అంటుంటారు. చిన్నప్పట్నుంచి వారి సినిమాలు చూస్తూ పెరగడం వల్ల వారి మేనరిజమ్స్ నాలో ఇమిడిపోయాయి. అందువల్లే నా నటనలో కానీ డ్యాన్స్ లో కానీ వారిని ఇమిటేట్ చేసినట్లు కనిపించవచ్చేమో కానీ కావాలని చేస్తున్నది కాదు” అంటున్నాడు సాయిధరమ్ తేజ్. రేపు విడుదలవుతున్న “ఇంటిలిజెంట్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా “ఫిల్మీఫోకస్”తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..!!
ఇంటిలిజెంట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్..
చాలా కొత్తగా ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది అని చెప్పాను కానీ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది నా క్యారెక్టర్. నా క్యారెక్టర్ నేమ్ “ధరమ్ తేజ్”. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, చిన్నప్పట్నుంచి ఏ పనినైనా తనకు అనుకూలంగా మలుచుకోవడం, ఎలాంటి సమస్యనైనా తెలివితో సాల్వ్ చేస్తాడు. సో క్యారెక్టరైజేషన్ కి సూట్ అవ్వడంతోపాటు, స్టోరీకి కూడా సింక్ అవ్వడంతో “ఇంటిలిజెంట్” అనే టైటిల్ పెట్టాం.
చిరంజీవిగారి తర్వాత నాతో చేస్తారనుకోలేదు..
నేనెప్పుడు నా తదుపరి సినిమాలు ఇలా ఉండాలి, ఈ దర్శకుడితో ఉండాలి అని ప్లాన్ చేసుకొను. కథ నచ్చితే చేసేయడమే. అయితే.. “ఇంటిలిజెంట్” విషయంలో మాత్రం నేను షాక్ కు గురైన అంశం ఏంటంటే.. వినాయక్ గారి దర్శకత్వంలో సినిమా చేయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ.. చిరంజీవిగారి 150వ సినిమా తర్వాత నాతో సినిమా తీస్తారని మాత్రం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.
తప్పులు, ఫ్లాపుల నుంచి చాలా నేర్చుకొన్నాను..
నా మునుపటి నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందులో “జవాన్, తిక్క” చిత్రాలు కాస్త భిన్నంగా ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాయి. కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు సినిమాలు ఫ్లాప్ అవ్వడం అనేది మాత్రం నా కెరీర్ మీద చాలా ప్రభావం చూపాయి. అయితే.. జరిగిన తప్పులను ఎనలైజ్ చేసుకొని భవిష్యత్ లో అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొన్నాను.
ఒకేరోజు వచ్చి హిట్ కొడదామనుకొన్నాం..
వరుణ్ “తొలిప్రేమ”, నా “ఇంటిలిజెంట్” ఒకేరోజు విడుదలవుతుందని అస్సలు అనుకోలేదు. కానీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాక మేం ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ “ఒకేరోజు ఇద్దరం మంచి హిట్ కొడదాం” అనుకొన్నామ్. కానీ తర్వాత మా సినిమాల నిర్మాతలు కూర్చుని రిలీజ్ డేట్స్ ఛేంజ్ చేశారు. నేనైతే ఇప్పటికీ మా రెండు సినిమాలు మాత్రమే కాకుండా అదే రోజు విడుదలవుతున్న మోహన్ బాబుగారి “గాయత్రి” కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను.
క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్లే..
సినిమాకి బడ్జెట్ అనుకొన్నదానికంటే కాస్త ఎక్కువే అయ్యింది. అయితే అదేమీ వృధాగా ఖర్చు పెట్టినది కాదు. ఔట్ పుట్ బాగా రావాలి, జనాలకి మంచి ఎంటర్ టైన్మెంట్ తోపాటు ఒక రిచ్ ఫిల్మ్ చూశామన్న ఫీలింగ్ కలిగించాలన్న భావనతోనే ఎక్కువ ఖర్చు చేశాం. సినిమా చూస్తున్నప్పుడు పెట్టిన ప్రతి పైసా మీకు తెరపై కనిపిస్తుంది.
ఇండస్ట్రీకి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది..
ఈమధ్య తెలుగు, తమిళంలో వస్తున్న కొత్త తరహా కథలు, కొత్త దర్శకులు సినిమాలు తీస్తున్న విధానం చూస్తుంటే సంతోషంగా ఉంది. కొన్ని సినిమాలు చూస్తుంటే.. నేను కూడా ఇలాంటి సినిమాలు చేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే.. నా దగ్గరకి మాత్రం ఎవరూ వైవిధ్యమైన కథలతో రావడం లేదు. ఎవరైనా అలాంటి కథ తీసుకొస్తారేమోనని నేను కూడా ఎదురుచూస్తున్నాను.
వాళ్ళకి చెప్పాలంటే.. ముందు నాకు హిట్స్ ఉండాలిగా
ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలందరూ నాకు మంచి స్నేహితులే. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగడం నాకు ఇష్టం. మా మధ్య ఎప్పుడూ సినిమా ముచ్చట్లు ఉండవు. ఇక “నువ్ ఇలాంటి సినిమా చెయ్” అని నేను చెప్పలేను. ఎందుకంటే.. “నువ్ నీ సినిమాలు చూసుకో” అని చెప్పే అవకాశం ఉంది (నవ్వుతూ).
అదే నేను చేసిన తప్పేమో..
చిరంజీవి, పవన్ కళ్యాణ్ గార్లను ఇమిటేట్ చేయడం అనేది నా చేతిలో ఉండదు. దర్శకులు నాతో అలా చేయిస్తున్నారు. ఇప్పుడు వినాయక్ గారు వచ్చి “తేజ్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిలా చెయ్” అని చెప్తే నేను చేయను అని చెప్పలేను. వాళ్ళు నాలో ఆ యాంగిల్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. సో ఇంత క్లారిటీగా చెప్పినా సరే మళ్ళీ ఇంకోసారి “ఎందుకు ఇమిటేట్ చేస్తున్నారు?” అని అడిగితే “మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గార్లకు మేనల్లుడిగా పుట్టడం నేను చేసిన తప్పు” అని చెప్పాలేమో.
రెజీనా లైఫ్ గురించి నన్ను ఎందుకు అడుగుతారు..
రెజీనాతో నేను రెండు సినిమాల్లో నటించిన విషయం, ఆమెతో నాకు మంచి అనుబంధం ఉన్న విషయం నిజమే. అయితే.. అది ప్రొఫెషనల్ లైఫ్ వరకే. అలాగని రెజీనా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో నన్ను క్వశ్చన్ చేయడం అనేది సరికాదు.
స్టైలింగ్ అనేది క్యారెక్టర్ కి తగ్గట్లుగా ఉండాలి..
“రేయ్, పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాల టైమ్ లో హెయిర్ స్టైల్ విషయంలో ఇష్యూస్ వచ్చాయి. మా అమ్మకే నా హెయిర్ స్టైల్ నచ్చలేదు. “సుప్రీమ్” నుంచి స్టైల్ సరిగా సెట్ అయ్యింది. అయితే.. “తిక్క, విన్నర్, జవాన్” ఇప్పుడు “ఇంటిలిజెంట్” విషయంలో సేమ్ స్టైల్ కంటిన్యూ చేస్తున్నాను అంటున్నారు కానీ.. క్యారెక్టర్ కి తగ్గట్లే అలా చేయాల్సి వస్తుంది తప్పితే నా ఇష్టం వచ్చినట్లు ఏం చేయడం లేదు.
కరుణాకరణ్, మారుతి, చంద్రశేఖర్ ఏలేటిలతో..
ప్రస్తుతం కరుణాకరణ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత మారుతి గారితో ఒక సినిమా అనుకొంటున్నాం. అది పూర్తయ్యాక చంద్రశేఖర్ ఏలేటిగారి దర్శకత్వంలో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది.