టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం కోసం యావత్ సినీ పరిశ్రమ, మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే న్యూస్ లీక్ అయింది. చిరు సినిమాలో మరో మెగా హీరో మెరవబోతున్నారట. ఇంతకీ ఎవరా మెగా హీరో అనుకుంటున్నారా.. ఇంకెవరు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).దర్శకుడు వశిష్ట మల్లిడి (Mallidi Vasishta) ‘విశ్వంభర’ను సోషియో ఫాంటసీ జానర్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ అనేది ఊహించని ట్విస్ట్. నిజానికి ఇది మొదట అనుకున్న ప్లాన్ కాదట. సినిమా యూనిట్ సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాయిధరమ్ తేజ్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) కలిసి ‘బ్రో’ (BRO) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పెద్ద మావయ్య చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
ఇన్సైడ్ టాక్ ప్రకారం, సాయిధరమ్ తేజ్ పాత్ర నిడివి మూడు నుండి 5 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అతని షూటింగ్ కూడా ఈరోజే ప్రారంభమైందని టాక్. ఇప్పటికే రెండు పాటలు, కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. కానీ, అసలు సమస్య సీజీ వర్క్.’విశ్వంభర’ సినిమాకు సీజీ వర్క్ చాలా కీలకం.
టీజర్ విడుదలైనప్పుడు సీజీ వర్క్ విషయంలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో మేకర్స్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీజీ వర్క్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, పర్ఫెక్ట్ ఔట్‌పుట్ కోసం సమయం తీసుకుంటున్నారట. అందుకే సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.