ప్రభాస్‌కు (Prabhas) ఉన్న ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ అప్డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ అయిపోవడం, థియేటర్ల దగ్గర అభిమానుల సందడి… ఇవన్నీ కంటెంట్ కంటే క్రేజ్ ఎంత ఉందో చెబుతున్న విషయాలే. అయితే ఈ క్రేజ్ టికెట్ కౌంటర్ల దగ్గర ఎలా కన్వర్ట్ అవుతోంది అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. లేటెస్ట్ ఉదాహరణగా ‘సలార్’ (Salaar) రీ రిలీజ్ నిలుస్తోంది. ఈ సినిమాను అభిమానులు మళ్లీ పెద్ద స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహంతో ముందే బుక్ మై షోలో టికెట్లు దొరకకుండానే హైప్ సృష్టించారు.
పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ షో ఏర్పాటు ఇలా అన్ని చేశారు. కానీ నంబర్ల విషయంలో మాత్రం ఆశించిన రేంజ్‌లో దూసుకెళ్లలేకపోయింది. ఓవైపు ప్రభాస్ స్థాయి స్టార్ అయినా కూడా, ఈ రీ రిలీజ్ ప్రీ సేల్ టికెట్లు కేవలం 1.02 లక్షలు మాత్రమే వచ్చాయి. తెలుగు రీ రిలీజ్‌లలో ఇది నాలుగో స్థానం మాత్రమే. గబ్బర్ సింగ్ (Gabbar Singh) , మురారి (Murari) , బిజినెస్ మేన్ (Businessman) లాంటి సినిమాలు ప్రభాస్ సినిమా కంటే టాప్ లో ఉన్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయితే ఏకంగా 1.75 లక్షల టికెట్లను కొల్లగొట్టింది. ఇది ఒకవిధంగా అభిమానుల నిబద్ధత, స్టార్డమ్‌ను చూపే గుణాంకమే. అదే ప్రభాస్‌కు మాత్రం ఆ స్థాయిలో నంబర్లు రాలేదు. తమిళంలో విజయ్ ఘిల్లిని మించి ప్రీ సేల్ రికార్డు సాధించినప్పటికీ, ఇది ప్రభాస్ లెవెల్‌కు సరిపోదన్న టాక్ ఉంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చ నడుస్తున్నది – ప్రభాస్ క్రేజ్ పక్కాగా ఉంది, ఫాలోయింగ్ అపారం.
కానీ అదే క్రేజ్ కలెక్షన్ లెక్కల్లోకి మారాలంటే, సినిమా, టైమింగ్ అన్నీ కలిసి రావాలి. లేకపోతే ఈ హంగామా అంతా నెట్టింట్లో మాత్రమే నిమిత్తమవుతుంది. ఇక ‘సలార్ 2’ వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతున్న తరుణంలో, ప్రభాస్ మార్కెట్ రేంజ్‌పై తిరిగి గట్టి ప్రూవ్ అవసరమవుతోంది. అభిమానుల స్పందన చూసినంత వేగంగా, బాక్సాఫీస్ రిజల్ట్ రావాలంటే… కంటెంట్‌తో పాటు, మార్కెటింగ్ గేమ్ ప్లాన్ మారాల్సిన సమయం ఆసన్నమైందనేది విశ్లేషకుల అభిప్రాయం.