ఎప్పుడెప్పుడా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూసిన ‘సలార్’ సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. బజ్‌కు తగ్గట్టు భారీ విజయం కూడా అందుకుంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్న ‘ఈ సినిమా రూ. వెయ్యి కోట్లు సంపాదిస్తుందా? ఒకవేళ సంపాదిస్తే ఎప్పుడు సంపాదిస్తుంది?’ అని. సినిమా చూసిన వాళ్లు, సినిమా సాధించిన విజయం గురించి తెలిసినవాళ్లు ఇదే మాట అడుగుతున్నారు. అయితే ఆ సినిమాకు వచ్చిన బజ్, టాక్ బట్టి రూ. వెయ్యి కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదు.
అయితే, ఇక్కడో మెలిక ఉంది. ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే కచ్చితంగా ఈ సినిమా కూడా రూ. వెయ్యి కోట్లు సాధిస్తుంది. అదే బాలీవుడ్ బెల్ట్‌లో వసూళ్లు. ఇప్పటికే దేశ సినిమా చరిత్రలో రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాలు లెక్కలు చూస్తే ఈ విషయం క్లియర్‌గా అర్థమైపోతుంది. అంతేకాదు ఇటీవల సౌత్‌లో వచ్చిన సినిమాలు సాధించిన విజయం, వసూళ్లు చూసినా రూ. వెయ్యి కోట్ల లెక్కలో చిక్కులు తెలిసిపోతాయి.
ముందుగా గతంలో వచ్చి రూ. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల సంగతి చూస్తే… ‘కెజీయఫ్ చాప్టర్ 2’ సినిమా మొత్తంగా రూ. 1200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘బాహుబలి 2’ సినిమా అయితే ఏకంగా సుమారు రూ. 1900 కోట్లు రాబట్టింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దాదాపు రూ.1200 కోట్లు సాధించింది. అయితే ఈ సినిమాల బాలీవుడ్ లెక్కలు చూస్తే… ‘కేజీయఫ్ 2’ రూ. 435 కోట్లు సంపాదించింది. ‘ఆర్‌ఆర్ఆర్’ అయితే రూ. 275 కోట్లు సాధించింది.
ఇక ‘బాహుబలి 2’ అయితే రూ. 500 కోట్లకు పైగా అందుకుంది. అందుకే ఆయా సినిమా రూ. వెయ్యి కోట్లు దాటి వసూళ్లు అందుకున్నాయి. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలకు బాలీవుడ్ బెల్ట్ ఎంతగా ఉపయోగపడిందో మీకు తెలిసే ఉంటుంది. అదే సమయంలో ‘జైలర్’, ‘విక్రమ్’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలకు బాలీవుడ్ సైడ్ సరైన వసూళ్లు లేవు. అందుకే రూ. వెయ్యి కోట్లకు వెళ్లలేకపోయాయి. ఇప్పుడు (Salaar) ‘సలార్’ ఆ స్థాయికి వెళ్లాలంటే బాలీవుడ్‌లో రాణించాలి.