బాలీవుడ్‌లో మిగిలిన సినిమాల సెట్స్ వాతావరణానికి, సల్మాన్ ఖాన్ సినిమా సెట్స్‌లో ఉండే వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అతనితో కలసి పని చేసిన చాలామంది నటులు ఈ విషయాన్ని చెప్పారు కూడా. ఇటీవల సల్మాన్ నుండి వచ్చిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో నటించిన యువ నటీమణులు కూడా ఈ విషయం చెప్పుకొచ్చారు. మహిళా నిపుణుల విషయంలో ఉండే డ్రెస్ కోడ్ అందులో ప్రధానమైనది అని చెప్పొచ్చు. దాని గురించి ఇటీవల ‘ఆప్ కీ అదాలత్’లో చర్చ వచ్చింది.
ఇటీవల ప్రసారమైన ‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో (Salman Khan) సల్మాన్ ఖాన్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్‌తో ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’లో కలసి నటించిన నటి పాలక్ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సల్మాన్ ఖాన్ తన సినిమా సెట్లో మహిళలందరూ మెడ వరకూ నిండుగా దుస్తులు ధరించేలా చూస్తారు’ అని చెప్పింది. దీంతో సల్మాన్‌ను విమర్శిస్తూ చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇదే విషయంలో ఇప్పుడు ‘ఆప్ కీ అదాలత్’తో ప్రస్తావించారు హోస్ట్ రజత్ శర్మ.
‘‘మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో మీరు రూల్స్ పెడతారు. కానీ సినిమాల్లో మాత్రం మీరు షర్ట్ విప్పి నటిస్తున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా?’’ అని రజత్ శర్మ అడిగారు. దీనికి ‘‘అందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమున్నాయి. నా దృష్టిలో మహిళల శరీరాలు చాలా విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది’’ అని సల్మాన్ అన్నాడు.
అంతేకాదు ఈ మాట మహిళల గురించి చెబుతున్న మాట మాత్రమే కాదని, మన తల్లి, భార్య, సోదరీమణుల్లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట అని అన్నాడు. మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను అని సల్మాన్ తన ఆలోచనను వివరించాడు.