స్టార్ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించిన విచారణ కూకట్ పల్లి కోర్టులో జరుగుతోంది. తన పరువుకు నష్టం కలిగేవిధంగా వ్యక్తిగత విషయాలపై సదరు యూట్యూబ్ ఛానెల్స్ అభ్యంతరకర వార్తలు రాశాయని గత బుధవారం సమంత పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వ్యవహరించాయని సమంత న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులుంటాయని.. సమంతకు తన భర్త నాగచైతన్యతో విడాకులు మంజూరు కాకముందే సదరు యుటీఓబీ ఛానెల్స్ ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగించాయని.. వెంటనే విచారించాలని కోరారు. దీంతో ఏకీభవించిన కోర్టు కేసుని విచారణకు స్వీకరించి సోమవారం నాడు విచారణ చేపట్టారు.
సమంత పిటిషన్ ను పూర్తిగా విచారించిన కోర్టు తీర్పుని రేపటికి వాయిదా వేసింది. సమంత తరఫు న్యాయవాది వాదనలను పూర్తిగా విన్న న్యాయమూర్తి.. తీర్పుని రేపు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారంటూ సమంత పిటిషన్ దాఖలు చేసింది. తన వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్ లో పేర్కొంది.