సంక్రాంతి అంటే తెలుగువారి మనసులో ముందుగా మెదిలేది కుటుంబం, పండుగ వాతావరణం, ఆ తర్వాత థియేటర్లలో సినిమా సందడి. కోడి పందాలు, గాలిపటాలతో పాటు కొత్త సినిమాలు లేకపోతే సంక్రాంతి పూర్తి అయినట్టు అనిపించదు. అందుకే టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు సినిమాలలో ప్రత్యేకమైన మార్కెట్, భారీ పోటీ ఉంటుంది. పెద్ద స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందరూ ఈ సీజన్‌లో తమ సినిమాలను బరిలోకి దింపుతారు.
Sankranthi
2001 నుంచి 2025 వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే… ప్రతి ఏడాది ఒక స్పష్టమైన సంక్రాంతి విన్నర్ మాత్రం కనిపిస్తూనే ఉన్నాడు. 2001లో నరసింహ నాయుడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. 2003లో ఒక్కడుతో మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగాడు. 2004లో వర్షం ప్రభాస్‌కు తొలి భారీ విజయాన్ని ఇచ్చింది.
ఆ తర్వాత నువ్వొస్తానంటే నేను వద్దంటానా, దేశముదురు, అదుర్స్, మిరపకాయ లాంటి సినిమాలు సంక్రాంతి విజేతలుగా నిలిచాయి. 2013లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రత్యేకంగా నిలిచింది. 2017లో ఖైదీ నెం.150తో చిరంజీవి రీఎంట్రీ రికార్డుల మోత మోగించింది. ఇటీవలి కాలంలో ఎఫ్2, బంగార్రాజు, వాల్తేరు వీరయ్య, హనుమాన్ లాంటి సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపాయి.
ఇప్పుడు అందరి దృష్టి 2026 పొంగల్ బరిపై ఉంది. ఈ ఏడాది చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. స్టార్ పవర్, కంటెంట్, మౌత్ టాక్ ఈ మూడింటిలో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.