బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, వెన్నెల కిశోర్ ఇలా చెప్పుకుంటూ హీరోలుగా ప్రయత్నించిన కమెడియన్ల జాబితా కూసింత పెద్దదే. అందుకోసం వీరిలో ఒకరిద్దరు నిర్మాతలుగా మారారు కానీ పెన్ను పట్టనే పట్టలేదు. వెన్నెల కిషోర్ పెన్ తోపాటు మెగాఫోన్ పట్టినా అందులో తాను హీరోగా నటించలేదు. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కామెడీని స్పీడెక్కించిన సప్తగిరి మాత్రం సొంత స్క్రిప్ట్ తో హీరోగా మారుతున్నాడు.
సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’. పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేసి ‘బెస్ట్ యాక్టర్స్’ సినిమాతో దర్శకుడిగా మారిన అరుణ్ పవర్ ఈ సినిమాకి దర్శకుడు. గాయకుడు బాలు తనయుడు ఎస్పీబీ చరణ్ నిర్మించిన తమిళ చిత్రం ‘తిరుడన్ పోలీస్’ మూలకథ ఆధారంగా సప్తగిరి స్క్రిప్ట్ తయారుచేశాడు. దర్శకత్వంలోను సప్తగిరి కల్పించుకున్నాడట. ఆ మాటకొస్తే ఈ చిత్ర దర్శకుడైన అరుణ్ పవర్ కి ఈ రంగంలో అనుభవం తక్కువే. సప్తగిరికి మాత్రం ఎనిమిదేళ్ల అనుభవం వుంది. పరుగు సినిమా వరకు సప్తగిరి దర్శకత్వ శాఖలో పనిచేసిన మాట తెలిసిందే. ఈ సినిమాతో హీరో సప్తగిరి ఎలాంటి ఫలితం అందుకుంటాడా మరి?