ఒకప్పటి నటులు సాయి కుమార్, శివాజీ లాంటి వాళ్లు హీరోలుగా సినిమాలు చేస్తూనే.. తోటి హీరోలకు డబ్బింగ్ చెప్పేవారు. రాజశేఖర్ నటించిన ఎన్నో సినిమాలకు సాయి కుమార్ డబ్బింగ్ ప్లస్ అయింది. అలానే శివాజీ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. హీరో నితిన్ సినిమాలకు ఆరంభంలో శివాజీనే డబ్బింగ్ చెప్పారు. నితిన్ తో పాటు మరికొంతమంది నటులకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ ల లిస్ట్ లోకి సత్యదేవ్ కూడా చేరిపోయాడు.
మొదటిసారి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి డబ్బింగ్ చెప్పాడు సత్యదేవ్. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో వినిపించిన సూర్య వాయిస్ ఇతడిదే. సూర్యకి సత్యదేవ్ వాయిస్ బాగానే సూట్ అయింది. అంతేకాదు.. సినిమాకి హిట్ టాక్ రావడంతో సత్యదేవ్ కి కూడా హెల్ప్ అయింది. ఇకపై సూర్య సినిమాలకు సత్యదేవ్ కే వరుసగా డబ్బింగ్ చెప్పే అవకాశాలు వచ్చినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. సత్యదేవ్ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ బాగుంటాయి. పైగా అతడిది బేస్ వాయిస్.
ఇంతకాలం తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ఈ నటుడు ఇప్పుడు సూర్య సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇకపై నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయిపోతాడేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘బ్రోచేవారెవరురా’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఈయన చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి.