సినిమాకో టీజర్, ట్రైలర్ ఉంటాయి. ఈ మధ్య గ్లింప్స్ అని, ఇంకొకటి అని విడుదల చేస్తూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి సినిమా వర్గాలు. అయితే ఒక సినిమా రెండు ట్రైలర్లు రావడం అరుదు. అప్పుడెప్పుడో ఒకటో, రెండో వచ్చాయి. అయితే సినిమా వాయిదా పడటం వల్ల అలా ఇచ్చారు. ఇటీవల కాలంలో అయితే ‘భీమ్లా నాయక్’కు అలా డబుల్ ట్రైలర్ కాన్సెప్ట్ చూశాం. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ విషయంలో తమ్ముడిని అన్న ఫాలో అవుతున్నాడని టాక్.
‘భీమ్లా నాయక్’ డబుల్ ట్రైలర్ కాన్సెప్ట్‌ను ‘ఆచార్య’ సినిమాకు అపెండ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్‌లో ఏమంత విషయం లేదనే విమర్శలు వస్తున్నాయి. సినిమా పాత్రల్ని పరిచయం చేయడం, కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప… పెద్దగా ఆకట్టుకునేలా లేదని వాదనలు వినిపిస్తున్నాయి. అంతెందుకు సినిమాలో హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్‌ను ఎక్కడా చూపించలేదనే అపవాదు కూడా పడ్డారు. ఈ డ్యామేజీని కవర్ చేయడానికి, సినిమాకు హైప్ తీసుకురావడానికి కొరటాల టీమ్..
మరో ట్రైలర్‌తో సిద్ధం చేస్తోందని టాక్. సినిమా విడుదలకు దగ్గర్లో ఈ కొత్త హై ఇన్‌టెన్స్ ఎమోషనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. అంటే అచ్చంగా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌లా అన్నమాట. అయితే అదెప్పుడు, ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అందులో కాజల్‌ను చూపిస్తారా, సినిమాకు సంబంధించి ఇంకేమైనా విషయాలు చెబుతారా అనేది చూడాలి. లేకపోతే సినిమా మీద విమర్శుల ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విడుదల సంగతికొస్తే…
సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నారు. నిన్నటి నుండి ప్రచారాన్ని షురూ చేసింది చిత్రబృందం. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, వరుస ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి. ఈ మేరకు చిరంజీవి, రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే వీరిని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు, ఏమేం ప్రశ్నలు వస్తాయి, వాటికి వాళ్లేం చెబుతారో చూడాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్లలో సుమ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ ఉంటారని ఓ పుకారు రన్ అవుతోంది.