సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కోట్లు సంపాదించినా సరిగ్గా ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తే చివరకు ఆర్థిక సంక్షోభం తప్పదు. ఇది గతంలో చాలా మంది సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగిందనే చెప్పాలి. ఆ జాబితాలో తమిళ సినిమా దిగ్గజం శివాజీ గణేశన్ కుటుంబం కూడా చేరింది. ఆయన మనవడు దుష్యంత్ (Dushyant) తీసుకున్న అప్పుల కారణంగా ఇప్పుడు వారి కుటుంబ ఆస్తులపై కోర్టు ఆదేశాలు వచ్చాయి. చెల్లించాల్సిన అప్పును తిరిగి చెల్లించకపోవడంతో కోర్టు, శివాజీ గణేశన్ కుటుంబానికి చెందిన ఇంటిని జప్తు చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
దుష్యంత్ తన ఈశాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా సినీ రంగంలో ప్రవేశించాడు. అయితే, సరైన ప్లానింగ్ లేకుండా తీసుకున్న అప్పులు చివరకు అతనిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తన సతీమణి అభిరామితో కలిసి ‘ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్’ సంస్థ నుంచి 3.74 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఈ మొత్తం తక్షణమే తిరిగి చెల్లించాల్సి ఉండగా, నెలకు 30% వడ్డీతో కూడిన చెల్లింపులు నిలిచిపోయాయి.
అప్పు తీసుకున్న సొమ్ముతో ‘జగజాల కిల్లాడి’ అనే సినిమా ప్రారంభించినా, అది నిర్మాణ దశలోనే ఆగిపోయింది. దీంతో అప్పు ఇచ్చిన సంస్థ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు విచారణలో దుష్యంత్ (Dushyant) అప్పు తీసుకున్న సొమ్మును ఇతర ఖర్చులకు వినియోగించానని అంగీకరించాడు. అంతేకాదు, తీసుకున్న అప్పు వివరాలను దాచిపెట్టే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించి, అప్పు తిరిగి చెల్లించేవరకు శివాజీ గణేశన్ (Sivaji Ganesan) కుటుంబానికి చెందిన ఇంటిని జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తమిళ సినీ వర్గాల్లో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పటి స్టార్ హీరో ఇంటికి తాళం వేసే పరిస్థితి రావడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. శివాజీ గణేశన్ తమిళ సినీ ఇండస్ట్రీలో ఎంతో గౌరవాన్ని పొందిన నటుడు. ఆయన సంపాదించిన ఆస్తిని మనవడు ఇలా అప్పుల్లో ముంచేయడం అభిమానులకు షాక్ కలిగించే విషయం.