తండ్రీ కొడుకులు బ్రహ్మానందం (Brahmanandam) , రాజా గౌతమ్ (Raja Goutham).. తాతామనవళ్లుగా కలసి నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) చిరంజీవికి పెద్ద తిప్పలే తెచ్చి పెట్టింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కొంతమంది హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో ఆఖరి నిమిషయంలో చిరంజీవి (Chiranjeevi) వచ్చారు. వచ్చినాయన సినిమా గురించి చెప్పి వెళ్లకుండా ఏదేదో మాట్లాడారు. అలాంటి ప్రశ్నలు ఆయనను ఎందుకు వేశారో, ఆయన ఎందుకు అలా సమాధానం చెప్పారో తెలియదు కానీ ఆయనకైతే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది అని అనుకుంటుండగా.. మరోసారి టాపిక్‌ను రైజ్ చేశారు మాజీ ఐఏఎస్ అధికారి కిరణ్ బేడీ. ఆమె రీసెంట్‌గా తన ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు. అందులో చిరంజీవి చేసిన కామెంట్ ఒకటి ఉంది. దానికి ఆమె రిప్లై ఉంది. అయితే ఈమాటలు ఆయన అని మూడు వారాలు దాటిపోయింది. దీంతో మాసిన గాయాన్ని మళ్లీ కిరణ్ బేడీ రేపారు అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
చిరంజీవి గారూ కూతురు కూడా వారసురాలే అని నమ్మండి. ఎందులోనూ అమ్మాయిలు తక్కువ కారని గ్రహించండి. కూతురుని ఎలా పెంచుతారు, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే వాటిపై అంతా ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన తల్లిదండ్రుల చూసి నేర్చుకోండి అని కిరణ్ బేడీ కామెంట్స్ చేశారు. అయితే చిరంజీవి అన్నది నట వారసత్వం గురించి అని, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ అయ్యాడని..
ఇప్పుడు మనవడు పుడితే ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అనే కోణంలో చిరంజీవి మాట్లాడారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు ఆ రోజు చిరంజీవి ఏమన్నారంటే.. మా ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారని, మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్‌లా అయిందని సరదాగా కామెంట్ చేశారాయన. అందుకే చరణ్‌ను (Ram Charan) ఓ మగపిల్లాడిని ఇవ్వమని అడుగుతున్నా అని, తమ కుటుంబ లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా అని చిరంజీవి చెప్పారు.