సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల చూసుకుంటే మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, ‘సింటోనియా’ నటి బ్రెజిలియన్ చైల్డ్ ఆర్టిస్ట్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే… మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సినీ రచయిత అలాగే సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయినటువంటి బి. కె. ఈశ్వర్ (BK Eshwar ) నిన్న అంటే బుధవారం నాడు మృతి చెందారు. ఆయన వయసు 77 ఏళ్ళు. కొన్నాళ్లుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన నిన్న మృతి చెందడం జరిగింది. ఇక ఈరోజు అనగా మే 15న గురువారం నాడు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ శ్మశానవాటికలో నిర్వహించారు కుటుంబ సభ్యులు.
ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన బి.కె.ఈశ్వర్ తర్వాత ఈటీవీ, తేజ టీవీల్లో పలు సీరియల్స్ కు రైటర్ గా పనిచేశారు. అలాగే ‘గీతాంజలి’ ఫేమ్ గిరిజ నటించిన ‘హృదయాంజలి’ ‘చీకటిలో నేను’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్’ ‘నగరంలో వినాయకుడు’ ‘అజయ్ పాసయ్యాడు’ ‘సూపర్ హిట్ జంబో క్రైమ్ స్టోరీ’ ‘నేను – ఆది – మధ్యలో మా నాన్న’ వంటి చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. బి.కె. ఈశ్వర్ కుమారుడు ప్రేమ్ చంద్ కూడా దర్శకుడిగా పలు సినిమాలు తీశారు.