“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంతో తెలుగు చిత్రసీమకు చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్ సంస్కృతిని మళ్ళీ పరిచయం చేయడమే కాక సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లను ఒకే ఫ్రేమ్ లో చూసే అదృష్టాన్ని కలిగించిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత తెరకెక్కించిన “ముకుంద” ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోయినా.. వరుణ్ తేజ్ కి మాత్రం మంచి లాంచ్ ప్యాడ్ లా నిలిచింది. ఇక మహేష్ తో మళ్ళీ సినిమా తెరకెక్కించే అవకాశం సొంతం చేసుకొన్న శ్రీకాంత్ అడ్డాల “బ్రహ్మోత్సవం”తో మహేష్ బాబు కెరీర్ లోనే కాక తెలుగు చిత్రసీమ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ కట్టబెట్టాడు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు మళ్ళీ మరో అవకాశం ఇవ్వడానికి స్టార్ హీరోలు మొదలుకొని యువ కథానాయకుల వరకూ ఎవరూ అవకాశం ఇవ్వలేదు.
దాదాపు రెండేళ్ల విరామం అనంతరం శర్వానంద్ కి శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చడంతో ఓ ప్రొజెక్ట్ సెట్ అయ్యింది. గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే సెట్స్ కు వెళ్లనుంది. తనకు బాగా అచ్చొచ్చిన బ్రదర్ సెంటిమెంట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు శ్రీకాంత్. శర్వానంద్ బ్రదర్ గా శ్రీవిష్ణు నటించనున్నాడు.