ఈ శుక్రవారం విడుదలైన మూడు తెలుగు సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ముగ్గురూ వారసులుగా ఇండస్ట్రీకి వచ్చినవారే. కెమెరామెన్ ఛోటా కె.నాయుడు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన సందీప్ కిషన్ నటించి, నిర్మించిన “నిను వీడని నీడను నేనే”, విజయ్ దేవరకొండ తమ్ముడి హోదాలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆనంద్ దేవరకొండ నటించిన “దొరసాని”, శ్రీహరి కుమారుడు మేఘాంస్ నటించిన “రాజ్ దూత్” చిత్రాలు నిన్న విడుదలయ్యాయి.
నిజానికి మూడు సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. కానీ.. మూడు సినిమాల్లో కాస్త బెటర్ ఏది అంటే మాత్రం సందీప్ బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చాడని చెప్పొచ్చు. ఈ మూడు సినిమాల మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ.. సదరు చిత్రా హీరోలు లేదా ఫిలిమ్ మేకర్స్ పడిన కష్టాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఈ సినిమాలన్నీ హిట్ అవ్వాలని కోరుకొన్నాయి. కానీ.. సంకల్ప బలంతోపాటు.. కథ-కథనాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ముగ్గురూ తమ తదుపరి చిత్రాలతోనైనా మంచి హిట్ కొట్టాలని ఆశిద్దాం.