గతేడాది కరోనా సమయంలో నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించి చాలా పెద్ద చర్చ జరిగింది. ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్లిపోయిందని.. నిర్మాతలు బాగా నష్టపోతున్నారని.. కాబట్టి నటీనటులు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారు. అయితే అలా జరగలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి.. తనకు ఎదురైన ఓ అనుభవాన్ని శృతిహాసన్ పంచుకుంది. కరోనా సమయంలో శృతిహాసన్ ను కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోమని ఓ నిర్మాత కోరాడట. దానికి ఆమె అంగీకరించిందట. కానీ హీరో కూడా తన రేటు తగ్గించుకున్నప్పుడు మాత్రమే..
తను కూడా పారితోషికం తగ్గించుకుంటానని స్పష్టం చేసిందట. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ల మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందని.. ఎంత గ్యాప్ అంటే కనీసం కలలో కూడా ఊహించుకోలేనంత గ్యాప్ ఉందని చెప్పుకొచ్చింది. కాబట్టి హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం అవివేకం అవుతుందని.. దాని గురించి మాట్లాడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా గురించి కూడా మాట్లాడింది శృతి. ‘సలార్’ అనేది యాక్షన్-డ్రామా సినిమా అని.. కానీ ఇందులో తను మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లు చేయలేదని.. ఈ సినిమా స్టోరీలోనే యాక్షన్ ఉందని తెలిపింది. సినిమాలో కథను నడిపించే పాత్ర తనదని.. అంతకుమించి ‘సలార్’ గురించి బయటపెట్టలేనని చెప్పుకొచ్చింది.