‘ది ప్యారడైజ్’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సమయంలో అనుకుంటాం.. ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ పెద్ద బూతు మాట వాడతారు. ఆ మాట అనకూడనది అయినా, వాడాల్సి వచ్చింది. సినిమా టైటిల్‌ని, కాన్సెప్ట్‌ని లీక్ చేస్తున్నదెవరు తమకు తెలుసని, తమకు దగ్గరి వాడేనని చెబుతూ అంత పెద్ద మాట వాడారాయన. అయితే ఆయన అంత చెప్పినా, అంతలా వార్నింగ్ ఇచ్చినా టీమ్‌లో ఎవరూ భయపడటం లేదా? ఏమో తాజాగా బయటకు వచ్చిన లీకులు చూస్తుంటే అదే అనిపిస్తోంది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది పారడైజ్’. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ అయింది. ఆ సమయంలో సెట్స్ కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా గీసిన మంచు మోహన్ బాబు స్కెచ్ ఫోటోలు బయటకు వచ్చాయి. జైలు గోడ మీద మోహన్‌బాబు ఫొటోను ఓ స్కెచ్‌లా గీసినట్లు ఆ లీకులు చూస్తే అర్థమవుతోంది. అంటే ఈ సినిమాలో మోహన్‌బాబు నటిస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు నిజమని తేలిపోయింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారని, జైలులో పెట్టించడం వల్లే నాని అలా గోడల మీద ఆ బొమ్మ గీసి తన పగను ప్రదర్శిస్తాడు అని సినిమా కథను కూడా కొంతమంది ఊహించేస్తున్నారు. ఆ ఊహలను పక్కన పెడితే ఇంత పెద్ద సినిమా తీస్తున్న నాని, శ్రీకాంత్ ఓదెల లీకుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఎలా? అయితే ఈ టెక్ యుగంలో ఎంత జాగ్రత్త పడినా లీకులు బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంకా జాగ్రత్త పడాలి.
ఇక పైన చెప్పినట్లు శ్రీకాంత్ ఓదెల వాడిన ఓ ఇబ్బందికరమైన మాట.. సినిమాలో పాత్ర చిత్రణల వెనుక ఉన్న మెయిన్ లైన్ అని.. అది లీకు వీరులను హెచ్చరించిన మాట కాదు అని ఓ వాదన ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే లీకులను ప్రచారం కోసం వాడుకున్నట్లే అని చెప్పొచ్చు. ఈ విషయంలో నిజానిజాలు టీమే చెప్పాలి.