అయితే ‘టిల్లు’.. లేదంటే ‘జాక్’.. ఇదేనా సిద్ధు ప్లాన్‌?

సినిమాలకు సీక్వెల్‌ తీయాలి అంటే కథే ఉండాలా? అంతకుముందు వచ్చిన సినిమాకు మంచి హైప్‌ వస్తే చాలు అనుకునే రోజులివి. అందుకే ఈ మధ్య పాత్ర/ పాత్రలను, పాత్ర చిత్రణలను పట్టుకుని కథలు రాసేస్తున్నారు. సినిమాలు చేసేస్తున్నారు. విజయాలు కూడా అందుకుంటున్నారు. మరి ఇలా అనుకుంటున్నారో, లేక నిజంగానే ఆలోచనలు వస్తున్నాయో కానీ సిద్ధు జొన్నలగడ్డ  (Siddu Jonnalagadda) ఇలాంటి సినిమాల మీదే మోజు పడుతున్నాడు. అలా మరో సినిమాకు సీక్వెల్స్‌ సిద్ధం చేస్తున్నారట / చేయిస్తున్నారట.

Siddu Jonnalagadda

‘టిల్లు’ అంటూ ఓ టిపికల్‌ క్యారెక్టర్‌ పట్టుకుని సినిమా చేసి విజయం అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ తర్వాత దానికి సీక్వెల్‌ కూడా వచ్చేసింది. రెండింటిలో టిల్లు పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే రెండు సినిమాలకు తెలివిగా లింక్‌ పెట్టారు సిద్ధు జొన్నలగడ్డ అండ్‌ టీమ్‌. ఇప్పుడు చేస్తున్న ‘జాక్‌’ (Jack) సినిమాకు కూడా ఇదే తరహాలో ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఈసారి ఒకటి కాదు రెండు సీక్వెల్స్‌ను ప్లాన్‌ చేశారట. వాటికి పేర్లు కూడా దాదాపు ఓకే అయిపోయాయి అని సమాచారం.

ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ సినిమాకు రెండు భాగాల కొనసాగింపు ఉంటుందని సమాచారం. వాటిని ‘జాక్ ప్రో’, ‘జాక్ ప్రో మ్యాక్స్’ అనే పేరుతో తీసుకొచ్చే ఆలోచన ఉందట. ‘జాక్‌’కి వచ్చే రిజల్ట్ బట్టి ఆ రెండు సినిమాలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అంటే ‘టిల్లు’ స్థాయి రెస్పాన్స్‌ వస్తే.. ‘జాక్‌’ మళ్లీ వస్తాడన్నమాట. లేదంటే టాటా బాయ్‌ బాయ్‌. అయితే ‘జాక్‌’ ట్రైలర్‌ అలానే కనిపిస్తోంది.

ఒకవేళ ‘జాక్‌’ బాగుండి మళ్లీ మళ్లీ వస్తే.. సిద్ధు జొన్నలగడ్డ పరిస్థితి అయితే ‘టిల్లు’ లేదంటే ‘జాక్‌’ అనేలా అయిపోతుంది. సీక్వెల్స్‌ అంటే అంతే కదా మరి. ఇక ‘జాక్’ సంగతి చూస్తే.. ట్రైలర్‌ ఆసక్తికరంగానే సాగింది. అయితే మధ్య మధ్యలో బూతులు పంటి కింద రాయిలా తగులుతాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

రాజ్యసభలో ఎంపురాన్ గొడవ.. జెట్ స్పీడ్ లో ఈడీ దాడులు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus