తెలుగు సినిమాలో హీరో సూపర్ హీరో. ఎంత మంది గూండాలు వచ్చినా, విలన్లు వచ్చినా, బాంబులు వేసినా, మిస్సైల్స్ వేసినా… హీరో లాగా వాటి మధ్య నుండి నడుచుకుంటూ వచ్చేస్తాడు. అలాంటి హీరో పాత్ర క్లైమాక్స్‌లో చనిపోతుంది అంటే… ఒప్పుకుంటారా. మన ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. పక్కనే ఉన్న తమిళ, మలయాళ, కన్నడలో ఇలాంటి పరిస్థితి లేదు. దీంతో టాలీవుడ్‌లో ఇలాంటి యాంటీ క్లైమాక్స్ సినిమాలు ఆశించిన స్థాయి విజయం, వసూళ్లు సాధించడం లేదు. కానీ మన రచయితలు, దర్శకులు అలాంటి కథలు ప్రేక్షకుల ముందుకు తెస్తూనే ఉన్నారు. తాజాగా మరికొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఈగ’, ‘జెర్సీ’ వంటి విషాదాంత సినిమాల్లో నటించాడు నాని. అలా టాలీవుడ్‌లో యాంటీ క్లైమాక్స్ హీరో అయిపోయాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడట. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’లోనూ ఇలాంటి పాత్రేనట. నాని ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్, వాసు అనే రెండు పాత్రలో కనిపిస్తాడట. అందులో ఓ పాత్ర ఆఖరులో చనిపోతుందని సమాచారం.
* ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ప్రధాన పాత్రధారి. శశి కిరణ్ తిక్క రూపొందిస్తున్నారు. కథ కీత్యా ఈ సినిమాలో యాంటీ క్లైమాక్స్ తప్పదు. ఫిబ్రవరి 11న సినిమాను విడుదల చేస్తారట.
* ‘రాధే శ్యామ్’ కూడా యాంటీ క్లైమాక్స్‌తోనే రూపొందింది అని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథ అని సమాచారం. ఈ సినిమా మోషన్ పోస్టర్‌లో రోమియో – జులియెట్, సలీమ్ – అనార్కలీ, దేవదాసు – పార్వతీ లాంటి వంటి అమర ప్రేమికులను చూపించి చివరకు విక్రమాదిత్య – ప్రేరణల ప్రేమ కావ్యం ఈ సినిమా అని అన్నారు. దీంతో ఈ సినిమా కూడా విషాదాంతమే అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే.